అక్షరటుడే వెబ్‌డెస్క్: FDA Food Check | మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఆహార భద్రతా తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఎక్స్పైరీ అయిన తినుబండారాలు విక్రయిస్తున్న ఓ దుకాణాన్ని తనిఖీ చేయడానికి వెళ్లిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారిని స్థానికులు నిలదీశారు. లంచం తీసుకుని దుకాణదారుడికి కొమ్ముకాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన జనం.. సదరు అధికారిపై తిరగబడి ఎక్స్పైరీ బిస్కెట్లు బలవంతంగా తినిపించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
FDA Food Check | అసలేం జరిగింది?
స్థానిక పాన్ షాపులో ఎక్స్పైరీ అయిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారనే ఫిర్యాదుతో ఈ వివాదం మొదలైంది. ఆ దుకాణంలో కొనుగోలు చేసిన ఒక చిరుతిండి తినడం వల్ల రెండేళ్ల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై తలతిరిగిపడిపోయింది. చిన్నారి ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ఈ ఘటనపై ఆగ్రహించిన చిన్నారి బంధువులు, స్థానికులు వెంటనే ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఎఫ్‌డీఏ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఒక అధికారి తనిఖీల నిమిత్తం ఆ దుకాణానికి చేరుకున్నారు. అయితే, అంతకుముందే వివాదాస్పదమైన స్నాక్స్ ప్యాకెట్లను దుకాణదారుడు తొలగించాడని స్థానికులు ఆరోపించారు.
FDA Food Check | లంచం ఆరోపణలు..
దుకాణంలో తనిఖీలు చేసిన అధికారికి పలు ఎక్స్పైరీ బిస్కెట్ ప్యాకెట్లు లభించాయి. అధికారులు వాటిని సీజ్ చేసినప్పటికీ, దుకాణదారుడిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడ్డారు. లంచం తీసుకుని అధికారి ఈ విషయాన్ని రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
అధికారిపై ఆగ్రహంతో ఊగిపోయిన జనం ఆయన్ను చుట్టుముట్టింది. ఆ బిస్కెట్లు సురక్షితమైనవే అయితే మీరే తిని చూపించాలంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలో కొందరు కోపోద్రిక్తులై ఆ ఎక్స్పైరీ బిస్కెట్లను ఆయన నోటిలో బలవంతంగా పెట్టేందుకు యత్నించడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.
FDA Food Check | రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌డీఏ తనిఖీలు..
మహారాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై ఎఫ్‌డీఏ అధికారులు ప్రస్తుతం పెద్దఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. కల్తీ ఆహారం, గడువు ముగిసిన ఉత్పత్తుల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్న తరుణంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
जब FDA अधिकारी ने एक्सपायरी डेट का बिस्किट बेचने वाले दुकानदार पर सख्ती नहीं की तब भीड़ ने वही एक्सपायर्ड बिस्किट अधिकारी के मुंह में ठूंस दी…
मामला महाराष्ट्र के छत्रपति संभाजीनगर जिले के वैजापुर का है.
पान की दुकान से खरीदा गया ‘खट्टा-मीठा चिवड़ा’ खाने के बाद 2 साल के… pic.twitter.com/TffF3BVNXp— Ruby Arun रूबी अरुण (@arunruby08) August 29, 2026
ఇది కూడా చదవండి: Kamareddy Municipal Meeting | బల్దియా సమావేశం రసాభాస.. మూడు పార్టీల కౌన్సిలర్ల నిరసనలు