FDA Food Check | లంచం ఆరోపణలు.. ఎఫ్‌డీఏ అధికారికి ఎక్స్‌పైరీ బిస్కెట్లు తినిపించే యత్నం

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఆహార భద్రతా తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: FDA Food Check | మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఆహార భద్రతా తనిఖీలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఎక్స్‌పైరీ అయిన తినుబండారాలు విక్రయిస్తున్న ఓ దుకాణాన్ని తనిఖీ చేయడానికి వెళ్లిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారిని స్థానికులు నిలదీశారు. లంచం తీసుకుని దుకాణదారుడికి కొమ్ముకాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన జనం.. సదరు అధికారిపై తిరగబడి ఎక్స్‌పైరీ బిస్కెట్లు బలవంతంగా తినిపించేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

FDA Food Check | అసలేం జరిగింది?

స్థానిక పాన్ షాపులో ఎక్స్‌పైరీ అయిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారనే ఫిర్యాదుతో ఈ వివాదం మొదలైంది. ఆ దుకాణంలో కొనుగోలు చేసిన ఒక చిరుతిండి తినడం వల్ల రెండేళ్ల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురై తలతిరిగిపడిపోయింది. చిన్నారి ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

ఈ ఘటనపై ఆగ్రహించిన చిన్నారి బంధువులు, స్థానికులు వెంటనే ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఎఫ్‌డీఏ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఒక అధికారి తనిఖీల నిమిత్తం ఆ దుకాణానికి చేరుకున్నారు. అయితే, అంతకుముందే వివాదాస్పదమైన స్నాక్స్ ప్యాకెట్లను దుకాణదారుడు తొలగించాడని స్థానికులు ఆరోపించారు.

FDA Food Check | లంచం ఆరోపణలు..

దుకాణంలో తనిఖీలు చేసిన అధికారికి పలు ఎక్స్‌పైరీ బిస్కెట్ ప్యాకెట్లు లభించాయి. అధికారులు వాటిని సీజ్ చేసినప్పటికీ, దుకాణదారుడిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడ్డారు. లంచం తీసుకుని అధికారి ఈ విషయాన్ని రాజీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

అధికారిపై ఆగ్రహంతో ఊగిపోయిన జనం ఆయన్ను చుట్టుముట్టింది. ఆ బిస్కెట్లు సురక్షితమైనవే అయితే మీరే తిని చూపించాలంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలో కొందరు కోపోద్రిక్తులై ఆ ఎక్స్‌పైరీ బిస్కెట్లను ఆయన నోటిలో బలవంతంగా పెట్టేందుకు యత్నించడంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.

FDA Food Check | రాష్ట్రవ్యాప్తంగా ఎఫ్‌డీఏ తనిఖీలు..

మహారాష్ట్ర వ్యాప్తంగా ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై ఎఫ్‌డీఏ అధికారులు ప్రస్తుతం పెద్దఎత్తున దాడులు నిర్వహిస్తున్నారు. కల్తీ ఆహారం, గడువు ముగిసిన ఉత్పత్తుల విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్న తరుణంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

 

ఇది కూడా చదవండి: Kamareddy Municipal Meeting | బల్దియా సమావేశం రసాభాస.. మూడు పార్టీల కౌన్సిలర్ల నిరసనలు

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *