Kamareddy Baldiya Meeting | బల్దియా రణరంగం.. వాదులాడుతున్న మూడు పార్టీల కౌన్సిలర్లు

ప్రజాసమస్యలకు పరిష్కారం చూపాల్సిన బల్దియా కార్యాలయం విమర్శలు, ప్రతి విమర్శలతో రణరంగాన్ని తలపించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Baldiya Meeting | ప్రజాసమస్యలకు పరిష్కారం చూపాల్సిన బల్దియా కార్యాలయం విమర్శలు, ప్రతి విమర్శలతో రణరంగాన్ని తలపించింది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు విసుకురుకున్నారు. కుర్చీలు ఎత్తారు. దాంతో కామారెడ్డి (Kamareddy) బల్దియా మరోసారి రచ్చకెక్కింది. ప్రజా సమస్యలపై బల్దియా కౌన్సిలర్లకు ఎంతవరకు పట్టింపు ఉందో మరోసారి రుజువు చేశారు.

కామారెడ్డి మున్సిపాలిటీ సమావేశం రసాభాసగా మారింది. పారిశుధ్యం, ఇతర ముఖ్యమైన 9 అంశాలతో బల్దియా సమావేశం శనివారం నిర్వహించారు. ఎజెండా అంశాలకు పరిపాలన ఆమోదం పొందితే సమస్యలు పరిష్కారం అయ్యేవి. అయితే ఎజెండాపై చర్చ సాగకుండానే వార్డులో సమస్యలపై సమావేశంలో ప్రస్తావన తేవడంతో సమస్య తీవ్రరూపం దాల్చి దాదాపు కొట్టుకునే వరకు వెళ్లింది.

Kamareddy Baldiya Meeting | రసాభాసగా సమావేశం

కామారెడ్డి బల్దియా సమావేశం మరోసారి వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే వరుస వాయిదాలతో అపవాదు మూట కట్టుకోగా శనివారం మరోసారి తీవ్రస్థాయిలో కౌన్సిల్ సభ్యులు రెచ్చిపోయారు. సమస్యలపై చర్చ సాగకుండానే కుర్చీలు లేపి, పోడియం ముందు బైఠాయించి, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ నినాదాలతో కౌన్సిల్ హాలును రణరంగంగా మార్చారు. అధికారులను ప్రశ్నిస్తుండగా మీరెవరు అంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు అడ్డు పడటంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయన్న వ్యాఖ్యలతో బీజేపీ కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు.

Kamareddy Baldiya Meeting | కుర్చీలు ఎత్తేసి, పైపైకి దూసుకెళ్తూ

సమావేశంలో తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకోవడంతో సంయమనం కోల్పోయిన కాంగ్రెస్ కౌన్సిలర్లు కుర్చీలను కింద పడేశారు. బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు ఒకరిపైకి ఒకరు దూసుకుని వెళ్లడంతో కౌన్సిల్ సమావేశం అదుపు తప్పింది. కమిషనర్ సర్ది చెప్పినా వినకపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేశారు. అడిషనల్ కలెక్టర్ చేరుకుని కౌన్సిలర్లతో మాట్లాడి సమావేశాన్ని కొనసాగించారు

Kamareddy Baldiya Meeting | అక్రమాలపై అడిగితే మీరెవరు అంటారా..?..బీఆర్ఎస్ కౌన్సిలర్లు..

అక్రమ కట్టడాలు, సమస్యలపై అధికారులను ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ కౌన్సిలర్లు అడ్డుకుని మీరెవరు అడగడానికి అంటారా..? తాము కూడా కౌన్సిలర్లం కాదా అని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రశ్నించారు. మమ్మల్ని అనగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో అక్రమ కట్టడాల వద్దకు అధికారులను పంపించి నోటీసులిప్పిస్తున్నారని, ముడుపులు చేతులు మారగానే ఆ నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులను అడిగే హక్కు తమకు ఉందన్నారు. ఇక నుంచి నోటీసులు ఎవరికి ఇచ్చినా మూడు పార్టీలతో చర్చించాలని, నోటీసులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. కమిషనర్ ఏ పార్టీకి లొంగకుండా ఉంటే తాము మద్దతుగా ఉంటామని, డబ్బులకు లొంగితే ప్రజల పక్షాన పోరాడతామని పేర్కొన్నారు.

Kamareddy Baldiya Meeting | అధికారంలో ఉన్నామంటున్నారు

రాష్ట్రంలో అధికారంలో తామే ఉన్నామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని, రాష్ట్రంలో అధికారంలో ఉండటానికి మున్సిపాలిటీకి సంబంధం ఏమిటని బీజేపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. కామారెడ్డిలో వరదలు వచ్చి ఏడాది అయిందని, సీఎం వచ్చి వెళ్లినా ఒక్క రూపాయి తీసుకువచ్చే తెలివి లేదని ఎద్దేవా చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీలో అక్రమాలు జరగనివ్వమని, ప్రజల పక్షాన ఎల్లప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటామన్నారు

Kamareddy Baldiya Meeting | అభివృద్ధిని అడ్డుకుంటున్నారు..

మున్సిపాలిటీలో అభివృద్ధిని బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆరోపించారు. గత రెండు ఎజండాలు ఆమోదానికి నోచుకోలేదన్నారు. మూడేళ్లలో ప్రజల పక్షాన పోరాటం చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు. బీజేపీ ఎమ్మెల్యే కామారెడ్డికి ఒక్క రూపాయి నిధులు తేలేదని, ఒక్క కొబ్బరికాయ కూడా కొట్టి అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. ప్రతిసారి సమావేశాన్ని అడ్డుకుని ప్రజా సమస్యలు పరిష్కారం కాకుండా చేస్తున్నారని ఆరోపించారు.

Kamareddy Baldiya Meeting | ఎజెండాకు కౌన్సిల్ ఆమోదం..

మున్సిపల్ సమావేశంలో ఎజెండాలో ప్రధానంగా చేర్చిన అన్ని అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఆందోళనలు అనంతరం అడిషనల్ కలెక్టర్ అద్వర్యంలో ఏజండాపై చర్చించారు. రూ.5.34 కోట్లతో మిషనరీల కొనుగోలు, స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.20 లక్షలతో మరుగుదొడ్ల నిర్మాణానికి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అలాగే 15 వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా రూ 2.39 కోట్లు, ఎస్ఎఫ్​సీ నిధుల ద్వారా రూ.1.39 కోట్లతో చెత్త సేకరణకు ఈవీ ఆటోలు, డోజర్ కొనుగోలుకు కౌన్సిలర్లు ఆమోదించారు. 49 వార్డులలో చెత్త సేకరణను ప్రైవేట్ ఏజన్సీకి అప్పగించి ప్రజల నుంచి యూజర్ చార్జీలు వసూలు చేసే అంశాన్ని కౌన్సిల్ తిరస్కరించింది.

Kamareddy Baldiya Meeting | కమర్షియల్​ ప్రాంతాల్లో మాత్రమే..

కమర్షియల్ ప్రాంతాలలో మాత్రం చెత్త సేకరణ బాధ్యత ప్రైవేట్ ఏజన్సీకి అప్పగించి చార్జీలు వసూలు చేసేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే ఈ అంశంపై కౌన్సిలర్లు, అధికారులు మరోసారి సమావేశమై నిర్ణయం తోసుకోవాలని నిర్ణయించారు. వర్షాల సమయంలో చేపట్టిన పనులకు సంబంధించి జేసీబీ బిల్లులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. వినాయక నిమర్జనం సందర్భంగా పట్టణంలో ఏర్పాట్ల కోసం రూ.20 లక్షలతో చేపట్టే పనులకు, 49 వార్డుల్లో శానిటేషన్​పై స్పెషల్ డ్రైవ్ చేపట్టడానికి కౌన్సిల్ ఆమోదించింది.

ఇది కూడా చదవండి..: Borgam School Ground | బోర్గాం(పి) స్కూల్​ మైదానాన్ని విస్తరించేందుకు కృషి చేస్తాం: కలెక్టర్​..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *