అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Borgam School Ground | నగరంలోని బోర్గాం(పి) బోర్గాం(పి) స్కూల్ మైదానాన్ని విస్తరించేందుకు కృషి చేస్తామని కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. శనివారం పాఠశాలను సందర్శించారు.
Borgam School Ground | పాఠశాలకు ప్రశంసలు..
పాఠశాలలో విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న బోధనా సిబ్బంది గురించి అడిగి తెలుసుకున్నారు. జిల్లాలోనే ఇతర అన్ని ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే అత్యధికంగా ఈ పాఠశాలలో 1120 మంది విద్యార్థులు చదువుకోవడం, ముగ్గురు ఉపాధ్యాయులకు జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు రావడంపై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా క్రీడా మైదానం లేదని నిర్వాహకులు తెలుపడంతో, స్కూల్కుకు ఆనుకుని ఉన్న ఆరోగ్య ఉప కేంద్రం, గ్రంథాలయ భవనాలను కలెక్టర్ (Collector Bhavesh Mishra) పరిశీలించారు. వీటిని సమీపంలో మరో చోటికి మార్చేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా అన్నది పరిశీలించాలని, దీనివల్ల పాఠశాలకు క్రీడా మైదానం వసతి సమకూరడంతో పాటు అదనపు తరగతి గదుల నిర్మాణాలకు వీలవుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. బడికి ఆనుకుని ఉన్న ప్రైవేట్ స్థలాన్ని సైతం కొంతమేర సేకరించి పాఠశాలను మరింతగా విస్తరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Borgam School Ground | విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలకు పరీక్ష..

ఈ సందర్భంగా కలెక్టర్ పదవ తరగతిని సందర్శించి విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాన్ని పరిశీలించారు. ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులను బోధించి, పలు ప్రశ్నలు వేస్తూ సమాధానాలు రాబట్టారు. సరైన సమాధానాలు చెప్పిన విద్యార్థులకు పెన్నులు బహుమతిగా అందజేశారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా సర్కారు బడుల్లో నాణ్యమైన విద్యా బోధనను అందించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. పిల్లలను కేవలం పాఠ్యాంశాలకే పరిమితం చేయకుండా బయటి ప్రపంచానికి సంబంధించిన విషయ పరిజ్ఞానం కూడా కల్పించాలని ఉపాధ్యాయులకు హితవు పలికారు. ఏకాగ్రతతో చదువుకుని ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే విషయ పరిజ్ఞానం పెంపొందించుకుని ప్రతిభను మెరుగుపర్చుకోవాలని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. కలెక్టర్ వెంట డీఈవో అశోక్, మోపాల్ తహశీల్దార్ రేఖ, ఎంఈవో సాయిలు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకర్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Municipal Meeting | బల్దియా సమావేశం రసాభాస.. మూడు పార్టీల కౌన్సిలర్ల నిరసనలు