అక్షరటుడే, కామారెడ్డి: Hotel Food Safety | ఉమ్మడి జిల్లాలో పలు హోటళ్లు, జాతీయ రహదారుల పక్కన ఉన్న దాబాల్లో భోజనం, ఇతర పదార్థాల నాణ్యతపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కుళ్లిన మాంసం, ఆహార పదార్థాల చుట్టూ బొద్దింకలు, బల్లులు తిరుగుతుండడం, అపరిశుభ్రమైన కిచెన్ వాతావరణం చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులే అవాక్కయ్యారు. ఇలా కూడా హోటళ్ల నిర్వహణ ఉంటుందా అని ముక్కున వేలేసుకున్నారు. తాజాగా టీజీ సేఫ్ బృందం చేపట్టిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బహిర్గతం కావడం చర్చనీయాంశంగా మారింది.
Hotel Food Safety | 10 బృందాల దాడులు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా (Nizamabad District)లో టీజీ సేఫ్ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ బృందాలు చేపట్టిన దాడుల్లో హోటళ్ల భాగోతం బయటపడింది. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవడంలో భాగంగా తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్ (టీజీ సేఫ్) ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ రహదారి-44 వెంట ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. టీజీ సేఫ్‌కు చెందిన 10 బృందాలు మెదక్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మొత్తం 20 ఆహార సంస్థలను తనిఖీ చేశాయి. ఇందులో కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి-44 వెంట 8 రెస్టారెంట్లను తనిఖీ చేశారు.
Hotel Food Safety | హోటల్స్, దాబాలలో పరిశుభ్రత కరువు
తనిఖీ చేసిన దాదాపు అన్ని హోటళ్లలో పరిశుభ్రత అనేది నామమాత్రంగానే ఉందని అధికారులు గుర్తించారు. వంటగదుల్లో జిడ్డు పేరుకుపోయి ఉండటం, ఫ్లోర్ పై చెత్త, కిచెన్ స్లాబ్ లు అపరిశుభ్రంగా ఉండటం, చేతి తొడుగులు, తలకు టోపీలు లేకుండానే వంట చేయడం, ఫుడ్ హ్యాండ్లింగ్ చేసే సిబ్బందికి మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం సాధారణంగా కనిపించింది. కీటకాలు, బొద్దింకలు, ఈగలు వంటగదిలోనే తిరుగుతున్న దృశ్యాలు అధికారులనే విస్మయానికి గురి చేశాయి.
Hotel Food Safety | కుళ్లిన కూరగాయలు, మాంసంతో వంటకాలు
లాభాల కోసం కొందరు హోటల్ నిర్వాహకులు కుళ్లన కూరగాయలు, వాడిపోయిన ఆకుకూరలు, గడువు ముగిసిన పాల ఉత్పత్తులు, సాస్ లు, ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన పాచిపోయిన మాంసంతో కర్రీలు, బిర్యానీలు తయారు చేస్తున్నట్లు బయటపడింది. కొన్ని చోట్ల ఫ్రిజ్ లలో శాఖాహారం, మాంసాహారం కలిపి నిల్వ చేయడం, లేబుల్ లేని, తయారీ తేదీ లేని ఆహార పదార్థాలను వాడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి ఆహారం తింటే ఫుడ్ పాయిజన్, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Hotel Food Safety | 9 హోటల్స్ లైసెన్సుల సస్పెన్షన్..
తనిఖీల్లో తీవ్రమైన ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు ఉపేక్షించలేదు. మూడు జిల్లాల్లో మొత్తం 9 హోటళ్ల ఆహార లైసెన్సులను సస్పెండ్ చేసి, తక్షణమే షట్టర్ డౌన్ చేయించారు. ఇందులో కామారెడ్డి జిల్లాలోనే ఆరు ఉన్నాయి. భిక్కనూర్ మండలం బస్వాపూర్ వద్ద జైకా మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, అంతంపల్లి వద్ద ది మాల్గుడి రెస్టారెంట్, భిక్కనూర్ సమీపంలో వసుధ ఫ్యామిలీ రెస్టారెంట్, కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ శివారులో ఉన్న న్యూ ఉడిపి కృష్ణ భవన్, సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి (కుప్రియల్ స్టేజి) వద్ద లుఫ్యాన్స్ ఫ్యామిలీ రెస్టారెంట్, సదాశివనగర్ వద్ద తాజ్ ఫ్యామిలీ దాబాల లైసెన్సులు సస్పెండ్ చేశారు. అలాగే నిజామాబాద్ పట్టణంలోని గ్లామర్ హోటల్‌ను సీజ్ చేశారు.
Hotel Food Safety | ఆరింటికి షోకాజ్ నోటీసులు
లైసెన్సులు సస్పెండ్ చేయడమే కాకుండా, మరికొన్ని హోటళ్లకు హెచ్చరికలు జారీ చేశారు. భిక్కనూర్ మండలం జంగంపల్లి వద్ద శ్రీ ఆధ్య గ్రాండ్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి జరిమానా విధించే ప్రక్రియ మొదలుపెట్టారు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి శివారులో ఆర్ఎస్ గ్రాండ్ రెస్టారెంట్‌కు ఇంప్రూవ్మెంట్ నోటీసు ఇచ్చారు. మొత్తం మూడు జిల్లాల్లో 21 ఆహార నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు. రిపోర్టు ఆధారంగా మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు.
Hotel Food Safety | దారికి వస్తారా..
అధికారుల దాడులు, లైసెన్సుల సస్పెన్షన్‌తో ప్రస్తుతానికి హోటల్ నిర్వాహకుల్లో వణుకు మొదలైంది. అయితే ఇది తాత్కాలికమేనా..? లేక శాశ్వతంగా మార్పు వస్తుందా..? అనేది ప్రజల్లో చర్చగా మారింది. గతంలో కూడా ఇలాంటి దాడులు జరిగినప్పుడు కొన్ని రోజులు హడావుడి చేసి మళ్లీ యథాతథంగా నాసిరకం ఫుడ్ పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈసారైనా హోటల్ యజమానులు దారికి వచ్చి పరిశుభ్రత పాటిస్తారా లేక మళ్లీ లైట్ తీసుకుంటారా అనేది వేచి చూడాలి.
ఇది కూడా చదవండి..: Kamareddy adulterated toddy | కామారెడ్డిలో కల్తీ కల్లుపై ఈగల్ టీం దాడులు!