Armoor BT Roads | ఐదు నెలలకే రోడ్లకు పగుళ్లు.. రూ. కోట్ల ప్రజాధనం వృథా..

ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.కోట్ల ప్రజాధనంతో కొత్తగా వేసిన బీటీ రోడ్లు ఐదు నెలలు కూడా కాకముందే అధ్వానంగా తయారయ్యాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్ : Armoor BT Roads | ఆర్మూర్ మున్సిపాలిటీ (Armoor Municipality) పరిధిలో రూ.కోట్ల ప్రజాధనంతో కొత్తగా వేసిన బీటీ రోడ్లు ఐదు నెలలు కూడా కాకముందే అధ్వానంగా తయారయ్యాయి. పట్టణంలోని పలు కాలనీల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిని, గుంతలమయం కావడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర నరకం చూస్తున్నారు. కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, ఇష్టారాజ్యంగా పనులు చేయడమే ఈ దుస్థితికి కారణమని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Armoor BT Roads | పట్టణంలో 36 వార్డులు..

​ఆర్మూర్​ పట్టణంలో 36 వార్డులు ఉన్నాయి. సుమారు 80వేల పైచిలుకు జనాభా ఉంది. అయితే పట్టణాభివృద్ధి కోసం రూ.18కోట్లు విడుదల అయ్యాయి. ఈ నిధులతో వరద కాల్వలు, బీటీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించేందుకు ప్రణాళికలు వేశారు. దీంట్లో హౌసింగ్ బోర్డు, పెర్కిట్, మహాలక్ష్మి కాలనీ, అంగడి బజార్, మామిడిపల్లి, జర్నలిస్ట్ కాలనీ, కింది బజార్, మీది బజార్, ఆలూరు రోడ్డు, జిరాయత్ నగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో కొత్త రోడ్లు పూర్తిగా పగుళ్లిచ్చాయి. చిన్నపాటి వర్షానికే తారు లేచిపోయి కంకర తేలుతోంది.

Armoor BT Roads | తరచూ ప్రమాదాలు..

​ఈ గుంతల కారణంగా ద్విచక్ర వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు కనిపించక వాహనాలు బోల్తా పడుతుండగా.. వృద్ధులు, మహిళలు నడవడానికి కూడా భయపడుతున్నారు. రానున్న వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే ఈ రోడ్ల పరిస్థితి మరెంత దారుణంగా మారుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Armoor BT Roads

Armoor BT Roads | ​నిబంధనలు ‘బేఖాతర్’.. అధికారుల నిర్లక్ష్యం

​మున్సిపల్ నిబంధనల ప్రకారం.. కొత్తగా వేసిన బీటీ రోడ్డు కనీసం ఐదేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండాలి. కానీ, ఆర్మూర్‌లో మాత్రం ఐదు నెలలకే రోడ్లు పగుళ్లు ఏర్పడ్డాయి. కాంట్రాక్టర్లు నాసిరకం మెటీరియల్ వాడటం, సరైన పద్ధతిలో రోలింగ్ చేయకపోవడమే ఇందుకు కారణమని ఇంజినీరింగ్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. పనులు జరుగుతున్న సమయంలో మున్సిపల్ అధికారులు పర్యవేక్షించకపోవడం వల్లే కాంట్రాక్టర్లు ఇంతలా తెగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Armoor BT Roads | ​​నాసిరకం రోడ్లు వేసిన కాంట్రాక్టర్లను..

నాసిరకం రోడ్లు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్‌పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సదరు సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఆయా కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. దెబ్బతిన్న రోడ్లను కాంట్రాక్టర్ సొంత ఖర్చులతోనే తిరిగి వేయించాలని కోరుతున్నారు. వర్షాకాలం ముంచుకొస్తున్నందున, యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టకపోతే రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Armoor BT Roads | ​బీటీ రోడ్లలో నాణ్యత కరువైంది..

– ​పూజా నరేందర్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు, ఆర్మూర్

​ఇటీవల మున్సిపల్ ఎన్నికల సమయంలో వేసిన బీటీ రోడ్లు ఐదు నెలల వ్యవధిలోనే గుంతలమయంగా  మారాయి. పలు కాలనీల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా, తూతూమంత్రంగా తారురోడ్లు వేసి చేతులు దులుపుకున్నారు. రూ.కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కాంట్రాక్టర్లు, ఇందుకు సహకరించిన అధికారులపై ఉన్నతాధికారులు తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి.

ఇది కూడా చదవండి..: Fee Reimbursement Pending | విద్యార్థులపై ఫీజు భారం.. సర్టిఫికెట్ల కోసం తిప్పలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *