అక్షరటుడే వెబ్‌డెస్క్: H1B Grace Period | అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయే హెచ్-1బీ వీసా ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనపై డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) ప్రభుత్వం దృష్టి సారించింది. వైట్‌హౌస్‌లోని ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ (OIRA) సమీక్షలో ఈ ప్రతిపాదనకు కీలక ఆమోదం లభించింది. త్వరలోనే దీనిని అధికారికంగా బహిరంగపరచే అవకాశం ఉంది. అయితే ఇది ఇంకా అమల్లోకి రాలేదు. పూర్తి వివరాలు, అమలు తేదీ, మినహాయింపులు అధికారికంగా ప్రచురితమైన తర్వాతే స్పష్టత వస్తుంది.
H1B Grace Period | గ్రేస్ పీరియడ్ అంటే ఏమిటి?
2017లో అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం.. కొన్ని నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా హోల్డర్లు ఉద్యోగం కోల్పోయిన తర్వాత సాధారణంగా 60 రోజుల వరకు అమెరికాలో ఉండి కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవచ్చు లేదా తమ ఇమ్మిగ్రేషన్ స్టేటస్‌ను మార్చుకోవచ్చు. ఈ వ్యవధి ఉద్యోగులకు కొత్త కంపెనీ స్పాన్సర్‌షిప్ పొందేందుకు ఎంతో కీలకంగా మారుతుంది. అయితే ప్రతి కేసుకు ఈ గడువు పూర్తి 60 రోజులు ఆటోమేటిక్‌గా లభిస్తుందని చెప్పలేం.
H1B Grace Period | దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి..
ఈ 60 రోజుల వెసులుబాటును పూర్తిగా రద్దు చేస్తే, ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ ఉద్యోగులకు తగినంత సమయం ఉండదు. వెంటనే కొత్త స్పాన్సర్‌ను వెతుక్కోవడం కష్టమవుతుంది. తక్కువ సమయంలో ఉద్యోగం దొరకకపోతే అమెరికాలో వారి ఇమ్మిగ్రేషన్ స్టేటస్ దెబ్బతింటుంది. కొందరు తక్కువ సమయంలోనే దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీంతో ఉద్యోగులు, వారి కుటుంబాలపై తీవ్ర మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
H1B Grace Period | నిబంధనల్లో మార్పు వస్తే..
అమెరికా హెచ్-1బీ వీసాల్లో భారతీయ నిపుణుల వాటా అత్యధికంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం ఆమోదం పొందిన హెచ్-1బీ పిటిషన్లలో దాదాపు 71 శాతం భారతీయులవే. అందువల్ల ఈ నిబంధనల్లో మార్పు వస్తే అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులు, టెక్నాలజీ ఉద్యోగులు, వారి కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్ కేవలం హెచ్-1బీ ఉద్యోగులకే కాదు.. E-1, E-2, E-3, H-1B1, L-1, O-1, TN వంటి ఇతర నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీలు, వాటిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుంది.
H1B Grace Period | ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రతిపాదన దశలోనే ఉంది. హెచ్-1బీ ఉద్యోగులకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ యథావిధిగా కొనసాగుతోంది. అధికారికంగా తుది నిబంధనలు, అమలు తేదీలు వెలువడే వరకు ప్రస్తుత నియమాలే అమల్లో ఉంటాయి. తుది నిబంధనలు వెలువడిన తర్వాతే దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది స్పష్టమవుతుంది.
ఇది కూడా చదవండి: NEET PG Exam Centres | నీట్ పీజీ పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్