అక్షరటుడే, వాషింగ్టన్: Hormuz Strait | ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద అమెరికా తన పట్టును మరింత బిగించింది. ఇరాన్ నౌకల రాకపోకలపై విధిస్తున్న ఆంక్షలను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సమర్థిస్తూ, దీనిని కేవలం ప్రాంతీయ దిగ్బంధనంగా కాకుండా ‘గ్లోబల్ మిషన్’గా అభివర్ణించారు.
Hormuz Strait | మరొక నౌక వెళ్లేది లేదు.. వచ్చేది లేదు:
పెంటగాన్ (Pentagon) వేదికగా జరిగిన మీడియా సమావేశంలో హెగ్సెత్ మాట్లాడుతూ.. హర్మూజ్ జలసంధిపై అమెరికా నేవీకి పూర్తి నియంత్రణ ఉందని స్పష్టం చేశారు. “మా అనుమతి లేకుండా ఏ నౌక హర్మూజ్‌లోకి ప్రవేశించలేదు, బయటకు వెళ్లలేదు. ఇరాన్ తన అణ్వాయుధ తయారీని శాశ్వతంగా విడనాడే వరకు ఈ ‘ఉక్కు కవచం’ లాంటి దిగ్బంధనం కొనసాగుతుంది” అని ఆయన హెచ్చరించారు. సముద్ర భద్రతను అస్థిరపరుస్తున్న ఇరాన్‌ను ‘సముద్రపు దొంగల ముఠా’ (Gang of pirates)తో ఆయన పోల్చారు.
Hormuz Strait | 34 నౌకలు వెనక్కి:
అమెరికా జాయింట్ చీఫ్స్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్ ఈ ఆపరేషన్ వివరాలను వెల్లడించారు. దిగ్బంధనం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు నిబంధనలు అతిక్రమించిన 34 నౌకలను అమెరికా బలగాలు వెనక్కి పంపాయని తెలిపారు. ఇటీవల అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేసిన ఒక ఇరాన్ నౌకపై కాల్పులు జరిపి, అందులోని సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన ధృవీకరించారు. ఈ నిఘా కేవలం హర్మూజ్‌కే పరిమితం కాదని, హిందూ, పసిఫిక్ మహాసముద్రాల్లోనూ ఇరాన్ నౌకలను అడ్డుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Hormuz Strait | చర్చల వేళ ఘాటు వ్యాఖ్యలు:
ఇస్లామాబాద్ (Islamabad) వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు జరగాలని భావిస్తున్న తరుణంలో అమెరికా ఇంత కఠిన వైఖరిని ప్రదర్శించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అయితే, అమెరికా చర్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందిస్తూ.. “ఈసారి వాషింగ్టన్‌తో నేరుగా మాట్లాడే ప్రసక్తే లేదని” తెగేసి చెప్పింది. ఈ దిగ్బంధనం అంతర్జాతీయ వాణిజ్య నియమాలకు విరుద్ధమని టెహ్రాన్ ఆరోపిస్తోంది.

ఇది కూడా చదవండి..: Thailand Funeral | మృతుడి చివరి కోరిక.. అంత్యక్రియల్లో నృత్య ప్రదర్శన, ఘటనపై సోషల్ మీడియాలో చర్చ

