అక్షరటుడే, వెబ్‌డెస్క్: White House Shooting | వైట్ హౌస్ సమీపంలో గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఏకంగా 30 రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం.
నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా తుపాకుల మోతతో మార్మోగిపోవడంతో అక్కడున్న వారంతా భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు తిరిగి కాల్పులు జరపడంతో ఇద్దరు దుండగులు మరణించినట్లు తెలిసింది.
White House Shooting | రంగంలోకి దిగిన సీక్రెట్ సర్వీస్
కాల్పుల శబ్దం వినబడిన వెంటనే అమెరికా అధ్యక్షుడి రక్షణ విభాగానికి చెందిన సీక్రెట్ సర్వీస్ (Secret Service) బలగాలు అప్రమత్తమయ్యాయి.
వైట్ హౌస్ చుట్టూ అదనపు బలగాలను మోహరించి, భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. అనుమానిత ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు.
White House Shooting | లోపలే డొనాల్డ్ ట్రంప్..
ఈ కాల్పుల ఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లోపలే ఉన్నట్లు సమాచారం.
కాల్పుల శబ్దం వినపడగానే సీక్రెట్ సర్వీస్ అధికారులు తక్షణమే స్పందించి, అధ్యక్షుడిని భూగర్భ బంకర్, సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ముప్పు లేదని, క్షేమంగా ఉన్నారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
White House Shooting | జర్నలిస్టుల పరుగులు..
కాల్పులు జరిగిన సమయంలో వైట్ హౌస్ బయట, లాన్ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు రిపోర్టింగ్ చేస్తున్నారు. ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురవడంతో జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీశారు.
భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగే ‘బ్రీఫింగ్ రూమ్’ (Briefing Room) లోకి జర్నలిస్టులందరినీ తరలించి, తలుపులు మూసేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు ఎవరినీ బయటకు రావద్దని ఆదేశించారు.
ఓ వైపు యుద్ధతంత్రం..
ఇరాన్‌పై భారీ ఎత్తున దాడి చేసేందుకు ట్రంప్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అదే సమయంలో దౌత్యపరమైన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో వ్యూహం పన్నేందుకు ట్రంప్ వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఇదే సమయంలో కాల్పులు జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రస్తుతానికి ఈ కాల్పులకు తెగబడింది ఎవరు? వారి ఉద్దేశం ఏంటి? అనే విషయాలపై స్పష్టత రాలేదు. ఈ ఘటనపై సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. ఉగ్రవాద కోణం ఉందా..? లేదా.. అనేది విచారణలో తేలనుంది.


