Iran US Peace Deal | ఇరాన్​తో అమెరికా ఒప్పదం.. భారీగా తగ్గిన క్రూడ్​ ఆయిల్​ ధరలు

ఇరాన్​–అమెరికా మధ్య శాంతి ఒప్పందం ఖరారు అయింది. ఈ మేరకు యూఎస్​ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Iran US Peace Deal | పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తగ్గుముఖం పట్టనున్నాయి. కొంతకాలంగా బాంబుల మోతతో దద్దరిల్లిన ప్రాంతాల్లో శాంతి వెల్లివిరియనుంది.

ఈ మేరకు ఇరాన్​–అమెరికా మధ్య ఒప్పందం ఖరారు అయింది. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌తో ఒప్పందం ఇప్పుడు పూర్తయింది. అందరికీ అభినందనలు! అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

మూడు నెలలకు పైగా సాగిన ఘర్షణకు ముగింపు పలికేలా, అమెరికా– ఇరాన్ ఒక ఒప్పందానికి వచ్చాయని, అలాగే లెబనాన్‌తో సహా అన్ని రంగాలలో సైనిక కార్యకలాపాలకు “తక్షణ మరియు శాశ్వత” ముగింపు ఉంటుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆదివారం (స్థానిక కాలమానం ప్రకారం) ప్రకటించారు. అయితే ఈ శాంతి ఒప్పందాన్ని అంగీకరించేలా వాషింగ్టన్‌ను టెహ్రాన్ (ఇరాన్) బలవంతం చేసిందని ఇరాన్ ప్రభుత్వ టీవీ పేర్కొంది.

Iran US Peace Deal | పాక్​ ప్రకటించగా..

ఈ ఒప్పందానికి సంబంధించిన కీలక పరిణామాన్ని మొదట మధ్యవర్తిత్వం వహించిన పాకిస్థాన్ ప్రకటించగా, ఆ తర్వాత వాషింగ్టన్, టెహ్రాన్ రెండూ ధృవీకరించాయి. జూన్ 19న స్విట్జర్లాండ్‌లో అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుంది. ఇరాన్ కూడా ఈ ఒప్పందాన్ని ధృవీకరించింది. ఈ ఒప్పందం యుద్ధానికి “తక్షణ ముగింపు” పలికిందని, తుది పరిష్కారం కోసం రెండు పక్షాలు రెండు నెలల్లోపు చర్చలు జరుపుతాయని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరిబాబాడి తెలిపారు.

Iran US Peace Deal | నిధుల విడుదలకు ఒకే

ఒప్పందానికి సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. అయితే అమెరికా 12 బిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ ఆస్తుల (స్తంభింపజేసిన నిధులు) విడుదలకు అంగీకరించిందని ఇరాన్‌కు చెందిన ‘మెహర్’ వార్తా సంస్థ తెలిపింది. శుక్రవారం స్విట్జర్లాండ్‌లో సంతకాల కార్యక్రమం జరగనుంది. తాను అక్కడ ఉంటానని, ట్రంప్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు.

Iran US Peace Deal | ఇజ్రాయెల్​పై ట్రంప్​ విమర్శలు

ఇరాన్‌తో శాంతి ఒప్పందాన్ని ప్రకటించిన అనంతరం ట్రంప్​ మాట్లాడుతూ.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు జరిపిన దాడులపై విమర్శలు గుప్పించారు. ఆ దాడులు తుది ఒప్పందానికి విఘాతం కలిగించేంత దగ్గరకు వచ్చాయని ఆయన అన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండి ఉంటే, ఇజ్రాయెల్ రెండు గంటల పాటు కూడా మనుగడలో ఉండేది కాదన్నారు.

Iran US Peace Deal | దిగివచ్చిన ముడి చమురు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హర్ముజ్​ జలసంధి మూసివేతతో కొంతకాలంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రపంచంలోని అన్ని దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. అయితే తాజాగా అమెరికా– ఇరాన్​ మధ్య శాంతి ఒప్పందం ఖరారు కావడతో ముడి చమురు భారీగా తగ్గాయి. బ్రెంట్ క్రూడ్​ ఆయిల్ 3.9 శాతం తగ్గి బ్యారెల్​ ధర 84 డాలర్లకు చేరింది. యూఎస్​ క్రూడ్​ 4.8శాతం తగ్గి 81 డాలర్ల వద్ద ట్రేడ్​ అవుతోంది. అయితే యుద్ధం ప్రారంభానికి ముందు ముడి చమురు ధరలు 70 డాలర్ల దిగువన ఉండేయి. మళ్లీ ఆ ధరలు రావడానికి చాలా రోజులు పట్టే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి..: India Innovation Hub | ఇన్నోవేషన్ హబ్‌గా భారత్.. స్టార్టప్‌లతో ప్రపంచాన్ని శాసిస్తున్నాం :మోదీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *