అక్షరటుడే, డిచ్పల్లి : Urea Shortage | యూరియా కొరతతో ఉమ్మడి జిల్లా అన్నదాతలు తీవ్ర ఆగచాట్లు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు వర్షాలు సకాలంలో కురవక పంటలపై ఆందోళన చెందుతున్న అన్నదాతలకు.. మరోవైపు అవసరమైన సమయంలో యూరియా దొరకకపోవడం మరింత సమస్యగా మారింది.
యూరియా (Urea) స్టాక్‌ను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతున్నామని అధికారులు చెబుతున్నా.. యాప్‌లో స్టాక్ కనిపించిన కొద్ది క్షణాల్లోనే బుకింగ్ పూర్తవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో గంటల తరబడి సొసైటీలు, ఎరువుల దుకాణాల వద్ద వేచి చూసినా ప్రయోజనం లేకుండా పోతోందని వాపోతున్నారు.
ప్రభుత్వం యూరియా, ఇతర ఎరువుల కొనుగోలు కోసం యాప్‌ను తీసుకొచ్చింది. ఆ యాప్‌లో బుక్ చేసుకుంటేనే ఎరువులు కొనుగోలు చేయొచ్చు. డీఏపీ, ఎంవోపీ, ఎన్పీకే వంటి ఎరువుల బుకింగ్‌కు ప్రస్తుతం ఇబ్బందులు లేవు. అయితే యూరియా బుక్ చేద్దామంటే స్టాక్ ఉండటం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో స్టాక్ అప్డేట్ చేసిన.. క్షణాల్లోనే మాయం అవుతోందని పేర్కొంటున్నారు. దీంతో స్మార్ట్‌ఫోన్ వాడటం రానివారు, చదువు కోని వారికి యూరియా దొరకడం లేదని చెబుతున్నారు. ఎరువుల యాప్‌లతో ఇబ్బందులు పడుతున్నామని పలు చోట్ల రైతులు ఆందోళన చేపడుతున్నారు. యాప్‌లను తక్షణమే తొలగించి.. గతంలో మాదిరిగా రైతులకు నేరుగా ఎరువులు అందించే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Urea Shortage | రెండు నిమిషాల్లో ఖాళీ
ఇందల్వాయి సహకార సంఘంలో సోమవారం యారియా వచ్చింది. దీంతో సొసైటీ సిబ్బంది 900 బస్తాల స్టాక్ ఉన్నట్లు ఆన్లైన్లో ఎంటర్ చేశారు. కేవలం రెండు నిమిషాల్లోనే మొత్తం బుకింగ్ పూర్తయిందని రైతులు ఆగ్రహించి ఆందోళనకు దిగారు. వ్యవసాయానికి అవసరమైన సమయంలో ఎరువులు అందుబాటులో లేకపోతే సాగు ఎలా కొనసాగించాలని ప్రశ్నించారు. ఇదే పరిస్థితి కొనసాగితే పంటలు వేయడం మానుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
Urea Shortage | పొట్ట దశలో యూరియా కీలకం
ప్రస్తుతం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరి పంట కీలకమైన పొట్ట దశకు చేరుకుంది. ఈ దశలో వరితో పాటు ఇతర పంటలకు కూడా యూరియా అత్యవసరం ఉంటుందని రైతులు చెప్తున్నారు. సకాలంలో ఎరువులు వేయకపోతే పంట ఎదుగుదలపై ప్రభావం పడటంతో పాటు దిగుబడులు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక పంటల పరిస్థితిపై ఆందోళన చెందుతున్న రైతులకు యూరియా కొరత మరో సమస్యగా మారింది. అవసరమైన సమయంలో ఎరువు అందకపోతే పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలకు నష్టం వాటిల్లుతుందని వారు అంటున్నారు.
Urea Shortage | ‘బడా రైతులకే’ ప్రాధాన్యమా?
యూరియా పంపిణీపై కొందరు రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సహకార సంఘాల కార్యదర్శులు, సిబ్బంది, ఫర్టిలైజర్ డీలర్లు.. స్టాక్ వచ్చిన విషయం సొసైటీ ఛైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, నాయకులు, ఊళ్లో పేరు మోసిన పెద్ద రైతులకు ముందుగానే సమాచారం చేరవేస్తురని ఆరోపిస్తున్నారు. యాప్‌లో స్టాక్ కనిపించిన వెంటనే తెలిసిన వ్యక్తుల పట్టాదారు పాస్‌బుక్ వివరాలతో యూరియా బుక్ చేయిస్తున్నారని, సాధారణ రైతులకు అవకాశం దక్కడం లేదని వాపోతున్నారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత కోసం తీసుకొచ్చిన ఆన్లైన్ విధానం.. క్షేత్రస్థాయిలో రైతులకు మాత్రం ఇబ్బందిగా మారింది. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్, యాప్‌లపై అవగాహన ఉన్నవారికే వేగంగా బుకింగ్ చేసే అవకాశం లభిస్తోందని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సాధారణ రైతులు మాత్రం స్టాక్ వివరాలు తెలుసుకునేలోపే బుకింగ్ పూర్తవుతోంది.
Urea Shortage | రోజుల తరబడి తిరుగుతున్నాం
– చిక్కెల మోహన్, రైతు, సాంపల్లి
‘పంటకు యూరియా వేయాల్సిన సమయం వచ్చింది. కానీ ఎరువుల దుకాణాల చుట్టూ తిరిగినా యూరియా దొరకడం లేదు. ఒకవైపు వర్షాలు సరిగా లేక పంటపై ఆందోళనగా ఉంటే.. మరోవైపు యూరియా కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. చాలామందికి స్మార్ట్‌ఫోన్‌లో యాప్ ఎలా ఉపయోగించాలో, ఎలా బుకింగ్ చేసుకోవాలో తెలియదు.
Urea Shortage | పనులు మానేసి తిరుగుతున్నాం
– భూక్య కిషన్, రైతు, ఇందల్వాయి
ఫోన్లో యూరియా బుకింగ్ ఎలా చేయాలో, ఏం నొక్కాలో అసలు తెలియదు. పంటకు ఎరువు కావాలి అంటే ఇప్పుడు ముందుగా యాప్‌లో బుక్ చేసుకోవాలంటున్నారు. బుకింగ్ కోసం సొసైటీకి వెళ్తే ఆధార్ కార్డుకు ఫోన్ నంబర్ లింకు లేదని చెప్తున్నారు. ఆధార్ కేంద్రానికి వెళ్లి నంబర్ లింకు చేసుకున్నాను. ఇప్పుడు బుక్ చేద్దామంటే యూరియా దొరకడం లేదు. పనులు మానేసి ఎరువు కోసం తిరగాల్సి వస్తోంది.
ఇది కూడా చదవండి..: Kavitha Bodhan Contest | బోధన్‌లో కవిత పోటీ చేస్తానంటే స్వాగతిస్తాం: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్