MLA Prashanth Reddy | నా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి : ఎమ్మెల్యే ప్రశాంత్​రెడ్డి

వర్షాభావం దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి తక్షణమే కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్​గల్ (ముప్కాల్): MLA Prashanth Reddy | వర్షాభావం దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలను పక్కనబెట్టి తక్షణమే కాళేశ్వరం జలాలను విడుదల చేయాలని బాల్కొండ (balkonda) ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా నిర్మించిన ముప్కాల్(Mupkal) పంప్ హౌస్ వద్ద సోమవారం ఆయన రైతులతో కలిసి వినూత్నంగా రక్తదాన నిరసన చేపట్టారు.

MLA Prashanth Reddy | రక్తదానం చేసి..

 ఆయన మాట్లాడుతూ.. ‘నా రక్తం తీసుకోండి.. రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వండి’ అంటూ ఆయన స్వయంగా రక్తదానం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బాల్కొండ  రైతుల రక్తపు సీసాలు, వినతిపత్రాన్ని ఎస్సారెస్పీ అధికారులకు అందజేసి, వాటిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపాలని కోరారు. గతంలో వర్షాభావ పరిస్థితులపై ప్రశ్నించిన విలేకరితో ‘వాళ్ల రక్తం చల్లితే పంటలు పండుతాయా?’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడారని మండిపడ్డారు. సీఎం అడిగినట్లుగానే నేడు తాము రక్తాన్ని ఇస్తున్నామని, ఇప్పటికైనా రైతుల పంటలను కాపాడేందుకు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

MLA Prashanth Reddy | రివర్స్ పంపింగ్ సిద్ధం గా ఉంది..

గోదావరి ద్వారా రోజుకు 10 టీఎంసీల కాళేశ్వరం(Kaleshwaram) నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోందని, వెంటనే కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ప్రారంభించి ఆ నీటిని ఎల్లంపల్లికి, అక్కడ నుండి వరద కాలువలోకి ఎత్తిపోసే అవకాశం ప్రభుత్వానికి ఉందన్నారు. వరద కాలువపై గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన రాంపూర్, రాజేశ్వరరావుపేట, ముప్కాల్ పంప్ హౌస్‌లు పూర్తిగా సురక్షితంగా, రివర్స్ పంపింగ్‌కు సిద్ధంగా ఉన్నాయని, వాటి ద్వారా నీటిని ఎత్తిపోసి శ్రీరాంసాగర్(SRSP Project) ప్రాజెక్టును నింపాలని సూచించారు.

MLA Prashanth Reddy | 4 టీఎంసీల నీరు వెంటనే ఇవ్వాలి

ప్రస్తుతం ఎస్సారెస్పీలో సుమారు 15 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని, నిజామాబాద్ జిల్లా రైతుల అత్యవసర అవసరాల కోసం వెంటనే 4 టీఎంసీల నీటిని విడుదల చేయాలని వేముల డిమాండ్ చేశారు. వరద కాలువకు 0.5 టీఎంసీలు, కాకతీయ కాలువకు 0.5 టీఎంసీలు, గోదావరి నదికి 0.5 టీఎంసీలు, మెంట్రాజ్ పల్లి పంప్ హౌస్ (ప్యాకేజీ-21) ద్వారా కప్పలవాగు, పెద్దవాగులకు: 0.5 టీఎంసీలు, గుత్ప–అలీసాగర్ ఎత్తిపోతల పథకాలకు, చెరువుల నింపుదలకు: 2.0 టీఎంసీలు విడుదల చేయాలని కోరారు. ఇలా నీరు విడుదల చేస్తే కనీసం 15 రోజుల పాటు రైతుల పంటలను కాపాడుకోవచ్చని, ఈలోపు కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా రివర్స్ పంపింగ్ చేపట్టి ఎస్సారెస్పీని తిరిగి నింపుకోవచ్చని వివరించారు.

MLA Prashanth Reddy | స్పందించకపోతే ఆందోళనలు తప్పవు

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం 6 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ రైతుల అవసరాల కోసం వరద, కాకతీయ కాలువలకు నీటిని విడుదల చేశామని, ఇప్పుడు 15 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఈనెల 15న జరగనున్న ఇరిగేషన్ మంత్రి స్థాయి ‘శివమ్’ సమావేశంలో రైతుల ప్రయోజనాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో వరద కాలువ, కాకతీయ కాలువ, గోదావరి పరిసర ప్రాంతాల్లో రైతులతో కలిసి దశలవారీగా ధర్నాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

reddy 2

prashanth 1

ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్​ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *