అక్షరటుడే, కామారెడ్డి: Power Cuts | విద్యుత్ కోతలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వ్యవసాయానికి సరిపడా కరెంట్ లేకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
కామారెడ్డి (Kamareddy) జిల్లాలో వ్యవసాయ పనులు దాదాపు ముగిశాయి. ప్రస్తుతం పంటలకు సరిపడా నీళ్లు అవసరం ఉంది. అయితే నీళ్లు పారితే తప్ప పంట బ్రతికే అవకాశం లేని సమయంలో త్రీ ఫేస్ కరెంట్ అన్నదాతలను ఆగం చేస్తోంది.
Power Cuts | ఎండిపోతున్న పంటలు..
జిల్లాలో ప్రస్తుతం వరి, సోయా, పత్తి, మొక్కజొన్న పంటలు కీలకమైన ఎదుగుదల దశలో ఉన్నాయి. ఈ సమయంలో సకాలంలో నీరు అందకపోతే పంట పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. గత 10 రోజులుగా మూడు ఫేజుల కరెంట్ కేవలం 5 నుంచి 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని, అది కూడా తక్కువ వోల్టేజీతో వస్తుండటంతో బోర్లు నీరు పోయడం లేదని రైతులు వాపోతున్నారు. రోజూ రాత్రి వేళల్లో కరెంట్ ఇస్తుండటంతో పొలాల వద్దకు వెళ్లాలంటేనే భయమేస్తోందని అంటున్నారు. పాము కాటు, తేలుకాటు భయంతో రాత్రి మోటార్లు ఆన్ చేయలేకపోతున్నామని, దీంతో రూ.వేలల్లో ఖర్చుపెట్టి వేసిన పంట ఎండిపోతుందని కన్నీరు పెడుతున్నారు. బీబీపేట, రాజంపేట్, సదాశివనగర్, గాంధారి, బాన్సువాడ మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉందని రైతులు చెబుతున్నారు.
Power Cuts | రోడ్డెక్కుతున్న రైతులు..
విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో రైతులు చివరికి రోడ్డెక్కక తప్పలేదు. బుధవారం పలు మండల కేంద్రాల్లోని విద్యుత్ సబ్ స్టేషన్లను రైతులు ముట్టడించారు. ప్రధాన రహదారులపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. బుధవారం పాల్వంచ, లింగంపేట మండలాల్లో రైతన్నలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఎన్నికల ముందు 24 గంటల నాణ్యమైన కరెంట్ అన్నారు. ఇప్పుడు 3 గంటలు కూడా సరిగా ఇవ్వడం లేదు. మా పంటలు ఎండిపోతుంటే అధికారులు ఏసీ గదుల్లో కూర్చున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కష్టాలు తీర్చాలని కోరుతూ.. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో విద్యుత్‌శాఖ ఎస్ఈకి వినతిపత్రం అందజేశారు. 18 గంటలు కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Power Cuts | విద్యుత్ అధికారులపై ఆగ్రహం..
కరెంట్ కోతలపై రైతులు విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో మరమ్మతులు చేయకపోవడం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య వస్తోందని ఆరోపిస్తున్నారు. లైన్లపై చెట్ల కొమ్మలు పడినా తొలగించడం లేదని అంటున్నారు. వ్యవసాయానికి రోజుకు కనీసం 9 గంటల పాటు పగటిపూట నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు.
Power Cuts | జిల్లాలో పంటల సాగు వివరాలు..
కామారెడ్డి జిల్లాలో సాగు పూర్తిగా బోరుబావులపై ఆధారపడి ఉంది. జిల్లాలో మొత్తం 5 లక్షల ఎకరాలకు పైగా సాగుభూమి ఉండగా, ప్రస్తుత వానాకాలంలో పంటల సాగు వివరాలు ఇలా ఉన్నాయి. వరి పంట 3,14,251 ఎకరాలు, సోయాబీన్ 87,736 ఎకరాలు, కంది 48,315 ఎకరాలు, మొక్కజొన్న 47,237 ఎకరాలు, పత్తి 45,864 ఎకరాలు, పెసర 2,198 ఎకరాలు, మినుము 1,851 ఎకరాలు, చెరకు 573 ఎకరాలు సాగవుతున్నాయి. ఇంత భారీ విస్తీర్ణంలో పంటలు సాగవుతున్న తరుణంలో కరెంట్ కోతలు పడటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సకాలంలో విద్యుత్ సరఫరా చేయకపోతే జిల్లాలో పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి.
ఇది కూడా చదవండి..: Free Police Training | ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి..: కలెక్టర్ భవేష్ మిశ్రా