Bangladesh Measles | బంగ్లాదేశ్‌లో తట్టు మహమ్మారి విజృంభణ.. భారత్‌కు హెచ్చరికలు జారీ చేసిన WHO

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Bangladesh Measles | పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో తట్టు (మీజిల్స్) మహమ్మారి తీవ్రరూపం దాల్చి ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా వ్యాపిస్తున్న ఈ వైరల్ వ్యాధి ఇప్పటికే 250 మందికి పైగా ప్రాణాలను బలిగొన్నట్లు సమాచారం. ముఖ్యంగా చిన్నారులే అధికంగా మృతి చెందడం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) కీలక హెచ్చరికలు జారీ చేసింది. వేగంగా వ్యాపించే ఈ వైరస్ సరిహద్దులు దాటి భారత్, మయన్మార్ వంటి దేశాలకు చేరే ప్రమాదం ఉందని పేర్కొంది. బంగ్లాదేశ్‌లోని మొత్తం 64 జిల్లాల్లో 58 జిల్లాల్లో మీజిల్స్ కేసులు నమోదవుతున్నట్లు WHO వెల్లడించింది. గత రెండేళ్లుగా, ముఖ్యంగా 2025లో ఇమ్యునైజేషన్ కార్యక్రమం మందగించడమే ఈ విజృంభణకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. అక్కడి ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం నమోదైన కేసుల్లో 91 శాతం ఒకటి నుంచి 14 ఏళ్లలోపు పిల్లలే ఉన్నారు.

Bangladesh Measles | భారత్‌కు ఎంత ప్రమాదం?

ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వం (Bangladesh Government) అత్యవసర వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించినప్పటికీ, వ్యాధి వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో సరిహద్దు దేశాల్లో అప్రమత్తత పెరిగింది. WHO నివేదిక ప్రకారం, బంగ్లాదేశ్‌కు ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ సరిహద్దు ప్రాంతాలు, ముఖ్యంగా జషోర్, చపైనవాబ్‌గంజ్ వంటి ప్రాంతాల నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి ప్రమాదం ఉంది. అలాగే ఢాకా, చట్టోగ్రామ్ నగరాల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలు అధికంగా ఉండటం కూడా మరో కారణంగా సూచించారు.అయితే భారత్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో అమలవుతున్న బలమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రధాన రక్షణ కవచంగా నిలుస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024-25లో మీజిల్స్-రుబెల్లా మొదటి డోస్ కవరేజ్ 93.7 శాతం, రెండో డోస్ 92.2 శాతంగా నమోదైంది.

Bangladesh Measles | గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి

తట్టు ఒక అత్యంత అంటువ్యాధి. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. సాధారణంగా 10 నుంచి 14 రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. అధిక జ్వరం, జలుబు, దగ్గు, కళ్లు ఎర్రబడటం, నోటిలో తెల్లటి మచ్చలు, తర్వాత శరీరంపై దద్దుర్లు ప్రధాన లక్షణాలు. ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స లేకపోవడంతో, న్యుమోనియా, డయేరియా, మెదడువాపు వంటి సమస్యలకు దారితీసి ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉంది. భారత్‌లో 2022లో కొవిడ్ ప్రభావంతో వ్యాక్సినేషన్ ప్రక్రియకు అంతరాయం కలగడంతో కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరిగాయి. అయితే అనంతరం ప్రభుత్వం అప్రమత్తమై ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసింది. 2026 నాటికి మీజిల్స్, రుబెల్లా నిర్మూలన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇది కూడా చదవండి..: RBI New Rules | బ్యాంకింగ్ రంగంలో పెను మార్పులు.. ప్రభుత్వ బ్యాంకులపై తీవ్ర ఒత్తిడి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *