అక్షరటుడే వెబ్‌డెస్క్: Birth Death Registration | దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదు విధానాన్ని మరింత పకడ్బందీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆలస్య నమోదు , అవకతవకలకు చెక్ పెట్టే ఉద్దేశంతో తీసుకొచ్చిన ‘జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం-2026’ అక్టోబర్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఈ మేరకు భారత రిజిస్ట్రార్ జనరల్ (RGI) మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం, రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ఈ సవరణ బిల్లు అధికారికంగా చట్ట రూపం దాల్చింది.
Birth Death Registration | కొత్త నిబంధనలు..
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం, 2026 అక్టోబర్ 1వ తేదీని ఈ చట్ట నిబంధనలు అమలయ్యే తేదీగా ఖరారు చేశారు. పుట్టుకలు , మరణాల వివరాలను నమోదు చేయడంలో ఎలాంటి జాప్యం జరగకుండా నిరోధించేందుకు ప్రభుత్వం ఈ పటిష్టమైన చర్యలను తీసుకుంది. నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు, పారదర్శకమైన కేంద్రీకృత డాటాబేస్‌ను రూపొందించడమే ఈ నూతన చట్టం ప్రధాన లక్ష్యం.
Birth Death Registration | డిజిటల్ విధానంలో సేవలు ..
ఈ నూతన సవరణ చట్టం ద్వారా డిజిటల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. దీనివల్ల పాఠశాల ప్రవేశాలు, పాస్‌పోర్ట్ దరఖాస్తులు, ఆధార్, ఓటర్ ఐడీ, వివాహ రిజిస్ట్రేషన్లతో పాటు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడానికి జనన ధ్రువీకరణ పత్రం ఇకపై అత్యంత కీలకమైన , ప్రాథమిక పత్రంగా మారనుంది. ఇప్పటివరకు జనన, మరణాల నమోదులో జరిగే జాప్యాన్ని అరికట్టేలా ఈ చట్టంలో నిబంధనలను రూపొందించారు. ఆలస్యంగా చేసుకునే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తిగా క్రమబద్ధీకరించి, పౌరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిజిటల్ విధానంలో సేవలు అందించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.
ఇది కూడా చదవండి: Telangana Liberation Day | పరేడ్ గ్రౌండ్స్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం