Kavitha Telangana Liberation | హిందూ-ముస్లిం పోరాటమంటూ బీజేపీ కుట్ర.. ఆనాడు ఆర్‌ఎస్‌ఎస్‌లే లేవు: కవిత

సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Kavitha Telangana Liberation | సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha )జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ విలీన పోరాట యోధుల స్ఫూర్తితో రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అరాచక శక్తులను తరిమికొట్టి, గద్దె దించుతామని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ ప్రజల పౌరుషానికి, పోరాట పటిమకు , త్యాగాల చరిత్రకు సజీవ సాక్ష్యమని కొనియాడారు. అయితే, ఈ చారిత్రక దినంపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు.

Kavitha Telangana Liberation | కవిత ఘాటు విమర్శలు..

సెప్టెంబర్ 17 చరిత్రను కాంగ్రెస్, బీజేపీలు స్వార్థం కోసం వక్రీకరిస్తున్నాయని కవిత విమర్శించారు. కాంగ్రెస్ పోరాటం వల్లే తెలంగాణ విలీనమైందని ముఖ్యమంత్రి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. సంస్థానాల్లో పోరాటం చేయడం తమ విధానం కాదని నాడే మహాత్మా గాంధీ స్పష్టం చేశారని గుర్తుచేశారు. నిజాం కాలంలో పేదలకు పంపిణీ చేసిన 10 లక్షల ఎకరాల భూమిని, భారత యూనియన్‌లో విలీనమైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే మళ్లీ లాక్కుని జమీందార్లకు కట్టబెట్టిందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మరోవైపు, ముస్లిం రాజుపై హిందువులు చేసిన పోరాటమంటూ బీజేపీ దీనికి మతపరమైన రంగు పులిమే కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. అసలు ఆనాటి పోరాట కాలంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఉనికే లేదని స్పష్టం చేశారు.

Kavitha Telangana Liberation | ప్రజలందరూ చేసిన పోరాటం..

నాటి జాగీర్‌దార్లు, జమీందార్ల అణచివేతకు వ్యతిరేకంగా మతాలకు అతీతంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా తుపాకీ పట్టి పోరాడారని కవిత తెలిపారు. వట్టికోట ఆళ్వార్ స్వామి, సురవరం ప్రతాపరెడ్డి, రావి నారాయణరెడ్డి వంటి మహనీయులు సైకిళ్లపై గ్రామాల్లో తిరుగుతూ ప్రజల్లో చైతన్యం రగిలించారని గుర్తుచేశారు. కాళోజీ, దాశరథి, షోయాబుల్లాఖాన్, మగ్దూం మొయినోద్దీన్ లాంటి కవులు, రచయితలు సమరశంఖం పూరించారని కొనియాడారు.

వారి స్ఫూర్తితోనే దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, మల్లు స్వరాజ్యం, అరుట్ల కమలాదేవి వంటి ధీరులు ఉద్యమాలకు ముందుకొచ్చారని పేర్కొన్నారు. నాటి మహనీయుల పోరాట స్ఫూర్తితోనే కులమతాలకు అతీతంగా ప్రజల హక్కులను కాపాడేందుకు తాము రంగంలోకి దిగామని, రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు చరమగీతం పలికే వరకు విశ్రమించేది లేదని కవిత తేల్చిచెప్పారు.

ఇది కూడా చదవండి:  Telangana Praja Palana Day | రాచరిక వ్యవస్థ నుంచి విముక్తి పొంది ప్రజాపాలనలోకి : మహిళా కమిషన్ ఛైర్​పర్సన్​ నేరేళ్ల శారద

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *