అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Home Loan Tips | సొంతిల్లు ఎంతో మంది కల. మధ్య తరగతి ప్రజలు, వేతన జీవులు తమ జీవితంలో ఎలాగైన సొంత ఇల్లు నిర్మించుకోవాలని తపిస్తారు. ఈ క్రమంలో హోమ్‌లోన్ తీసుకుంటున్నారు. అయితే లోన్ తీసుకునే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చిక్కులు తప్పవు.
గతంలో ఇంటి రుణం చాలా కష్టంగా ఉండేది. అయితే ప్రస్తుతం ఈజీగా లోన్ లభిస్తోంది. కారణం ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు. హోమ్‌లోన్ (House Loans) ఇవ్వడానికి అనేక సంస్థలు పుట్టుకోచ్చాయి. వీరు ఇంటింటికి తిరిగి మీకు లోన్ కావాలా అని అడుతున్నారు. పాత ఇళ్లకు సైతం లోన్లు ఇస్తున్నారు. అవసరం ఉంటేనే హౌస్‌లోన్ తీసుకోవాలి. కానీ ఈ సంస్థల ఉద్యోగుల తమ టార్గెట్ కోసం ప్రజలకు మాయమాటలు చెప్పి లోన్ తీసుకునేలా చేస్తున్నారు.
Home Loan Tips | వడ్డీ అధికం
సాధారణంగా ప్రభుత్వ బ్యాంకు (Bank)ల్లో హోమ్‌లోన్ వడ్డీ తక్కువగా ఉంటుంది. ఏడాదికి 10శాతం లోపే వడ్డీ (Interest) వసూలు చేస్తాయి. కానీ ప్రైవేట్ సంస్థలు భారీగా వడ్డీ వసూలు చేస్తాయి. 15 నుంచి 20 శాతం వరకు వడ్డీ ఉంటుంది. అయితే సులువుగా లోన్ ఇస్తుండటంతో అమాయక ప్రజలు వీరి మాయలో పడుతున్నారు. బ్యాంకుల్లో అయితే లోన్ రావడం కోసం మనం తిరగాల్సి ఉంటుంది. సరైన పత్రాలు సమర్పించాలి. మన ఆదాయ వివరాలు ఇవ్వాలి. అయితే ప్రైవేట్ సంస్థలు ఇవేమీ ఇవ్వకున్న లోన్లు ఇస్తున్నాయి. ఆ కంపెనీల ఉద్యోగులు తమ టార్గెట్ల కోసం అవసరమైన పత్రాలు వారే సిద్ధం చేసుకుంటున్నారు. లోన్ తీసుకునే వారికి ఎలాంటి ఆదాయ వనరు లేకున్నా.. నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. అనంతరం లోన్లు ఇస్తున్నారు.
Home Loan Tips | కట్టడానికి అవస్థలు
ప్రైవేట్ సంస్థల్లో తక్కువ సమయంలో లోన్ వస్తుంది. అంతేగాకుండా డబ్బులు కూడా అధికంగా ఇస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంత ప్రజలు వీటిని ఆశ్రయిస్తున్నారు. అయితే వడ్డీ అధికంగా ఉన్న విషయాన్ని వారు గమనించడం లేదు. దీంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా రైతులు, ప్రైవేట్ ఉద్యోగాలు (Private sector jobs) చేసేవారు ఈఎంఐలు కట్టడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. మొదట్లో బాగానే కడుతున్నా.. ఒకటి రెండేళ్లు గడిచాక అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా రైతులకు (Farmers) ప్రతి నెలా ఆదాయం ఉండదు. ఆరు నెలలకు ఒకసారి పంట వచ్చినప్పుడు మాత్రమే డబ్బులు ఉంటాయి. వీరికి కూడా లోన్లు ఇస్తున్న సంస్థలు.. బిజినెస్ లేదా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టిస్తున్నాయి. ఫలితంగా ప్రతి నెలా ఈఎంఐ (EMI) కట్టడానికి వీరు బయట అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
Home Loan Tips | ఇలా చేయాలి
హోమ్‌లోన్ తీసుకునే సమయంలో జాగ్రత్తలు పాటిస్తే దీంతో మేలు జరుగుతుంది. ఇంటికి వచ్చి లోన్ ఇస్తామని చెప్పేవారి మాయలో పడొద్దు. నాలుగైదు బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను కలవాలి. ఎక్కడ వడ్డీ తక్కువగా ఉందో చూడాలి. అక్కడ మాత్రమే లోన్ తీసుకోవాలి. మనం ప్రతినెలా ఎంత ఈఎంఐ కట్టగలమో ముందే నిర్ణయించుకోవాలి. ఎక్కువ మొత్తం పెట్టుకొని తర్వాత ఇబ్బందులు పడొద్దు. లోన్ పీరియడ్ ఎక్కువ రోజులు పెట్టుకుంటే కట్టాల్సిన ఈఎంఐ తక్కువగా ఉంటుంది. అయితే కట్టే వడ్డీ మొత్తం భారీగా పెరుగుతుంది. ఈ విషయాలన్నింటిని లెక్కలు వేసుకొని లోన్ తీసుకోవాలి. లేదంటే ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవాలి.
Home Loan Tips | అప్పు తీసుకొని ఆర్భాటాలు వద్దు
ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఆధునిక హంగులతో ఇళ్లను నిర్మించుకుంటున్నారు. నగరాల్లో ఉండే అన్ని వసతులు కల్పించుకుంటున్నారు. గొప్పల కోసం అప్పులు చేసి మరి ఇల్లును అందంగా నిర్మించుకుంటున్నారు. అనంతరం వాటిని తీర్చలేక ఆందోళన చెందుతున్నారు. కొందరు ఆస్తులు అమ్మేసుకుంటున్నారు. డబ్బులు ఉన్నవారు, ఈఎంఐలు కట్టగలిగే స్థోమత ఉన్నవారు తమ ఇంటిని ఎలా నిర్మించుకున్న ఏం కాదు. అయితే ఒకరిని చూసి మరొకరు గొప్పలకు పోవడంతో సమస్య వస్తోంది. ప్రస్తుతం ద్రవ్యోల్భణం పెరిగింది. రానున్న రోజుల్లో రెపో రేటు పెరిగే అవకాశం ఉంది. అలా అయితే వడ్డీ రేట్లు పెరిగి ఈఎంఐల భారం సైతం పెరుగుతుంది. ఈ విషయాలను గమనించుకొని హోమ్‌లోన్ తీసుకోవాలి.
దీనిని కూడా చదవండి : Danam Nagender | సుప్రీం కోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్