అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Danam Nagender | దానం నాగేందర్ యూ టర్న్ తీసుకున్నారు. నిన్న హైకోర్టు (High Court) తీర్పును స్వాగతిస్తున్నానని చెప్పిన ఆయన తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఉప ఎన్నికలకు సిద్ధమని, సుప్రీంను ఆశ్రయించనని శుక్రవారం ఆయన మాట్లాడారు. శనివారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయనపై స్పీకర్ అనర్హత వేటు వేయకపోవడంతో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది. దానం పార్టీ మారినట్లు ఆధారాలు లేవని గతంలో స్పీకర్ ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టివేసింది.
Danam Nagender | కోర్టు అనుమతిస్తుందా..
దానం నాగేందర్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) అనుమతిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇది కోర్టు ముందుకు సోమవారం వచ్చే అవకాశం ఉంది. దానం పిటిషన్‌పై సుప్రీం అప్పీల్‌కు అనుమతిస్తే ఆయన హైకోర్టు తీర్పును సవాల్ చేయనున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పుపై ఉత్తర్వులు ఇచ్చే సమయంలో తమ వాదనలు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. దీంతో అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.
Danam Nagender | స్పీకర్ వర్సెస్ హైకోర్టు
ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు స్వీకరిస్తే.. స్పీకర్ అధికారులు, న్యాయస్థానం పరిధిపై విస్తృత చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ కేసు దేశం దృష్టిని ఆకర్షిస్తుంది. గతంలో అనేక మార్లు స్పీకర్, న్యాయస్థానాల మధ్య కేసులు వచ్చాయి. స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలకు లేదని వారు వాధిస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు పలుమార్లు ఈ విషయంలో జోక్యం చేసుకుంది. గతంలో అనర్హత పిటిషన్లపై విచారణకు గడువు ఉండేది కాదు. అయితే సుప్రీంకోర్టు 3 నెలల్లో విచారణ చేపట్టి నిర్ణయం తెలపాలని స్పష్టం చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని.. సాంకేతిక కారణాలతో స్పీకర్లు అనర్హత పిటిషన్లను కొట్టివేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దానం నాగేందర్ కేసును సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి, తీర్పు చెబితే ఫిరాయింపులపై కీలకం కానుంది.
ఇది కూడా చదవండి : DUSU Election Results | ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం