అక్షరటుడే, తెయూ క్యాంపస్ : Ramadugu Project | రామడుగు ప్రాజెక్టు (Ramadugu Project) కుడి, ఎడమ కాలువల నుంచి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి (MLA Bhupati Reddy) సాగునీటిని విడుదల చేశారు. కుడి కాలువ నుంచి 90 క్యూసెక్కులు, ఎడమ కాలువ నుంచి 30 క్యూసెక్కుల చొప్పున మొత్తం 120 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 6,100 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలోని ప్రాజెక్టులకు కొంతమేర నీరు చేరిందని, జిల్లాలో అత్యధికంగా వరి సాగు చేస్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని రైతులు పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. సాగునీటి విడుదలపై ఆంక్షలు ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డితో కలిసి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో ప్రత్యేకంగా చర్చించి రామడుగు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేందుకు అనుమతులు పొందినట్లు భూపతి రెడ్డి తెలిపారు.
Ramadugu Project | మూడు విడతల్లో..
మూడు దశల్లో నీటిని విడుదల చేయనున్నందున చివరి ఆయకట్టు వరకు నీరు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రైతులు కాలువలకు ఎక్కడా గండ్లు కొట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు సైతం కాలువల్లో లీకేజీలు లేకుండా పర్యవేక్షిస్తూ చివరి ఆయకట్టు వరకు నీటిని సక్రమంగా అందించాలని సూచించారు. భవిష్యత్‌లో కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే అలీసాగర్, గుత్పా ప్రాజెక్టుల నుంచి కూడా సాగునీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే గుర్తుచేశారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాయారెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు నరేష్, పొలసాని శ్రీనివాస్, బాలరాజు, మనోహర్ రెడ్డి, అమృతపూర్ గంగాధర్, అంబర్ సింగ్, సంజయ్ రెడ్డి, ఆనంద్, మహేందర్ పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Nizamabad Cheetah Force | నగరంలో వ్యభిచార గృహాలపై చీతాఫోర్స్ దాడి