అక్షరటుడే, బాన్సువాడ: Banswada Tribal Issues | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు వెయ్యి రోజులు పూర్తవుతున్నా గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. మంగళవారం బాన్సువాడ (Banswada)లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Banswada Tribal Issues | గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చి..
గిరిజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అదే గిరిజనులను విస్మరించిందని ఆరోపించారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుతం గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడంతో పాటు వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. దాదాపు మూడేళ్లు కావస్తున్నా గిరిజనుల సంక్షేమానికి సరైన నిధులు కేటాయించలేదని, ఒక్క పథకాన్ని కూడా సమర్థవంతంగా అమలు చేయలేదని విమర్శించారు.
Banswada Tribal Issues | 17న ప్రతి తండాలో నిరసన కార్యక్రమాలు
గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈనెల 17న బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి తండాలో నిరసన దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ప్రతి తండాలోని గిరిజన బిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం, ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాన్ని వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వాస్తవాలను వివరించాలని కోరారు.
Banswada Tribal Issues | బీఆర్ఎస్ హయాంలోనే గిరిజనులకు మేలు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గిరిజనులకు నిజమైన న్యాయం జరిగిందని గోవర్ధన్ పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 57 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి, సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. బాన్సువాడ మండలం పులికుచ్చ తండాకు చెందిన మాజీ సర్పంచ్ పీర్సింగ్తో పాటు పలువురు బీఆర్ఎస్లో చేరారు. వారికి బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో అంజిరెడ్డి, మోరిల్ శ్రీనివాస్ రావు, జుబేర్, ధర్మతేజ, మోచి గణేష్, బోడ చందర్, సాయిబాబా, ఖలీల్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Kamareddy Education | నాణ్యమైన విద్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి: జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క