Nizamabad ORR Demand | కాంగ్రెస్​కు చెందిన జిల్లా ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి: దినేష్​ కులాచారి

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Nizamabad ORR Demand | సీఎం రేవంత్​రెడ్డి ఇచ్చిన ఓఆర్​ఆర్​, బైపాస్​ రోడ్డు హామీలను అమలు చేయకపోతే కాంగ్రెస్​కు చెందిన జిల్లా ప్రజాప్రతినిధులు తక్షణమే రాజీనామాలు చేయాలని బీజేపీ (Nizamabad BJP) జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి డిమాండ్​ చేశారు. ఈ మేరకు నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

Nizamabad ORR Demand | పదవుల్లో ఉండి ఏం లాభం..

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం.. జిల్లాకు ఔటర్​రింగ్​ రోడ్డు మంజూరు కాకపోవడం అత్యంత దురదృష్టకరమని దినేష్​ ఆవేదన వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ (PCC President Mahesh Goud), కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డిలు జిల్లాకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ముఖ్యమంత్రి హామీ అమలు కాకపోవడానికి నైతిక బాధ్యత వహిస్తూ వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాకు ఓఆర్​ఆర్​ తీసుకురాలేని ప్రజాప్రతినిధులకు పదవుల్లో కొనసాగే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు.

Nizamabad ORR Demand | అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ లేదు..

కాంగ్రెస్ నాయకులకు జిల్లా అభివృద్ధిపై ఏమాత్రం శ్రద్ధ లేదని, తమ సొంత పార్టీ కార్యాలయం కోసం నగర నడిబొడ్డున స్థలాన్ని కేటాయించుకున్న వాళ్లు.. ప్రజలకు ఉపయోగపడే బస్టాండ్ కోసం మాత్రం స్థలాన్ని గుర్తించలేకపోయారని ఆయన ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ (MLC) మహేష్ గౌడ్ వెంటనే సీఎంతో మాట్లాడి ఓఆర్​ఆర్​ ORR మంజూరు కోసం పోరాడాలని, లేకపోతే ఓఆర్​ఆర్​ రాకపోవడానికి ఆయనే కారణంగా చరిత్రలో మిగిలిపోతారన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున ఎంపీ అర్వింద్ (MP Arvind)​ నేతృత్వంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Nizamabad ORR Demand | బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి..

అదే సమయంలో బీజేపీ ఎంపీ అర్వింద్ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్నారని దినేష్​ పేర్కొన్నారు. ఇందూరు అభివృద్ధి కోసం బీజేపీ ఎప్పటికప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తోందని గుర్తుచేశారు. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన జిల్లాకు ఔటర్​ రింగ్​రోడ్డు తెచ్చుకోగలిగినప్పుడు, మహేష్ కుమార్ గౌడ్‌కు ఆ దమ్ము లేదా అని ప్రశ్నించారు. రేవంత్​రెడ్డి, మహేష్​కుమార్​ గౌడ్​ల మధ్య కమీషన్ల బేరసారాలు కుదరకపోతేనే ఓఆర్​ఆర్​ ఫైల్​ పక్కన పడేశారా అనే విషయాన్ని స్పష్టం చేయాలని డిమాండ్​ చేశారు.

మున్సిపల్ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇందూరు గడ్డపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయినందుకు నైతిక బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ కార్పొరేటర్లు, మేయర్ తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు పోతన్​కర్ లక్ష్మీ నారాయణ, నాగోల్ల లక్ష్మీ నారాయణ, ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్, రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, కార్పొరేటర్లు మల్కాయ్ మహేందర్, ఎర్రం సుధీర్, మల్లేష్ యాదవ్, బొబ్బిలి వేణుగోపాల్, శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవి, కార్యాలయ కార్యదర్శి బద్దం కిషన్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమందు విజయ్ కృష్ణ, బీజేపీ నాయకులు భూపతి, ఆనంద్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Unnao Rape Case| కుల్దీప్ సింగ్ సెంగార్ శిక్షపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *