Jurala Project | జూరాల వద్ద ఉద్రిక్తత.. బీఆర్​ఎస్​ నాయకుల అరెస్ట్​

జూరాల ప్రాజెక్ట్​ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు బీఆర్​ఎస్​ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jurala Project | జూరాల ప్రాజెక్ట్​ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గద్వాల జిల్లాలోని ఈ ప్రాజెక్ట్​ నుంచి ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. వారికి మద్దతుగా బీఆర్​ఎస్​ నాయకులు సోమవారం నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. పలువురు నాయకులు, రైతులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

రైతుల (Farmers) ఆందోళనలకు మద్దతుగా డ్యాం పైన ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునివ్వడంతో ఉదయం నుంచే ప్రాజెక్ట్​ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రాజెక్ట్​కు వెళ్లే అన్ని మార్గాల్లో భారీగా మోహరించారు. భారీకేట్లు, పోలీసు వాహనాలు అడ్డుపెట్టి ఆ మార్గంలో వచ్చే వాహనాలను తనిఖీ చేశారు. ఆత్మకూరు గద్వాల రహదారిపై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ధర్నాకు వెళ్లకుండా మాజీమంత్రి నిరంజన్ రెడ్డిని హౌస్​ అరెస్ట్​ చేశారు. పలువురు బీఆర్​ఎస్​ నేతలను సైతం ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

Jurala Project | మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​రెడ్డి డ్యామ్​పైకి వెళ్లేందుకు యత్నించారు. ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులు, బీఆర్​ఎస్​ నాయకులు ఆయనను అరెస్ట్​ చేయకుండా అడ్డుకున్నారు. పోలీసులు వాహనానికి అడ్డుగా పడుకొని నిరసన తెలిపారు. రోడ్డుపై అడ్డంగా కట్టెలు రాళ్లు పేర్చి, పోలీసు వాహనం వెళ్లకుండా చేశారు. దీంతో పోలీసులు వారిని పక్కకు లాగేశారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. పలువురు రైతులు పోలీస్​ నిర్బంధాన్ని దాటి జూరాల వద్దకు చేరుకున్నారు. కాల్వలోకి దిగి నిరసన తెలిపారు.

Jurala Project | సర్కార్​ విఫలం

రైతులు, బీఆర్​ఎస్​ నాయకుల అరెస్ట్​పై మాజీ మంత్రి నిరంజన్​రెడ్డి మాట్లాడారు. శ్రీశైలం నుండి 670 కిలోమీటర్ల దూరంలో కుప్పంకి నీళ్లు పోతున్నాయని, 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలమూరుకు ప్రభుత్వం నీరు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కుప్పంలో అక్కడి ప్రభుత్వం జలహారతి ఇస్తుంటే, ఇక్కడ రైతులు సాగునీటి కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు నీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రేవంత్ రెడ్డి గురుభక్తి కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: KCR Farmhouse Land | కేసీఆర్ ఫామ్‌హౌస్ భూముల వివాదం.. ఎర్రవల్లిలో సర్వే పునఃప్రారంభం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *