Mallesh Weapons Theft Case | బొల్లారం ఆయుధాల చోరీ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి..!

హైదరాబాద్‌లోని బొల్లారం మద్రాసు రెజిమెంట్ నుంచి ఆయుధాలు చోరీకి గురైన కేసులోమరో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Mallesh Weapons Theft Case | హైదరాబాద్‌లోని  ( Hyderabad ) బొల్లారం మద్రాసు రెజిమెంట్ నుంచి ఆయుధాలు చోరీకి గురైన కేసులోమరో బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అరెస్టయిన మాజీ హవాల్దార్ మల్లేష్‌కు గతంలో నేరచరిత్ర ఉన్నట్లు మల్కాజ్‌గిరి పోలీసుల కస్టడీ విచారణలో తేలింది. 2005 నుంచి 2007 మధ్య కాలంలో అచ్చంపేట, అమ్రాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మల్లేష్‌పై ఇళ్లలో చోరీలు (హౌజ్ బ్రేకింగ్) కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆ కేసులు కోర్టులో వీగిపోవడంతో అతను నిర్దోషిగా బయటపడినట్లు తేలింది.

ఈ నేపథ్యంలో, మిలటరీ ఉద్యోగంలో చేరే సమయంలో మల్లేష్ ఈ పాత కేసుల వివరాలను అధికారులకు వెల్లడించాడా లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, ఉద్యోగ ఎంపిక సమయంలో అతని నేపథ్యాన్ని (బ్యాక్‌గ్రౌండ్) అధికారులు సరిగ్గా తనిఖీ చేశారా లేదా అని పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి అప్పట్లో సమర్పించిన పత్రాలను మళ్లీ పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు.

Mallesh Weapons Theft Case | ఆదివార రోజే ఎందుకు ?

మద్రాసు రెజిమెంట్ యూనిట్ నుంచి ఆయుధాలు తస్కరించేందుకు మల్లేష్ ఎన్ని నెలలుగా పథకం పన్నాడు, దీనికోసం ఎవరినైనా సంప్రదించాడా, ఇంటర్నెట్ ద్వారా సమాచారం సేకరించాడా అనే కోణంలోనూ పోలీసులు కూపీ లాగుతున్నారు. అయితే, చోరీకి ఆదివారం రోజే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఉందని విచారణలో తేలింది. ఆదివారం పూట ఉన్నతాధికారుల నిఘా తక్కువగా ఉంటుందని, వారి రాకపోకలు ఉండవని మల్లేష్ భావించాడట. అంతేకాకుండా, గార్డ్ డ్యూటీలో ఉండేవారు కూడా విశ్రాంతి తీసుకుంటారనే పక్కా అవగాహనతోనే అతను ఈ ప్లాన్ వేసినట్లు సమాచారం.

Mallesh Weapons Theft Case | మిలటరీ ఇంటెలిజెన్స్ విచారణ..

కస్టడీలో ఉన్న మల్లేష్‌ను బొల్లారం పోలీసులతో పాటు మిలటరీ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా సంయుక్తంగా విచారించేందుకు సిద్ధమయ్యారు. వినాయక నిమజ్జనం పూర్తయిన తర్వాత మరింత లోతుగా ప్రశ్నించనున్నారు. మరోవైపు, మల్లేష్ తన మొబైల్ ఫోన్‌లో డిలీట్ చేసి, క్లియర్ చేసిన చాట్‌లకు సంబంధించిన ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక అందిన తర్వాత ఆ విషయాలపై కూడా అతన్ని ప్రశ్నించనున్నారు. అయితే, కస్టడీ విచారణకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: Jharkhand Road Accident | రోడ్డు ప్రమాదంలో మంత్రి కూతురు మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *