UPI MDR Petrol Pumps | పెట్రోల్ బంకుల్లో యూపీఐ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఎండీఆర్ ఛార్జీల పై కేంద్రం కీలక అడుగు

యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న కొత్త నిబంధనల నేపథ్యంలో పెట్రోల్ బంక్ డీలర్లకు ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: UPI MDR Petrol Pumps | యూపీఐ లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయనున్న కొత్త నిబంధనల నేపథ్యంలో పెట్రోల్ బంక్ డీలర్లకు ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. అక్టోబర్ 15 నుంచి రూ.2,000 దాటిన యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) వర్తించనున్న సంగతి తెలిసిందే. అయితే, పెట్రోల్ బంకుల్లో రూ.2,000కు మించిన యూపీఐ లావాదేవీలను ఎండీఆర్ ఛార్జీల నుంచి పూర్తిగా మినహాయించాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

UPI MDR Petrol Pumps | డీలర్లకు వచ్చే మార్జిన్లు ..

ఈ మేరకు ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (AIPDA) ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ప్రత్యేకంగా లేఖ రాసింది. పెట్రోల్, డీజిల్ విక్రయాలపై డీలర్లకు వచ్చే మార్జిన్లు పరిమితంగా ఉంటాయని, ప్రతి లావాదేవీపై ఫ్లాట్‌గా రూ.5 ఎండీఆర్ చెల్లించాల్సి వస్తే తమపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. డీలర్ల ఈ విజ్ఞప్తిని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ద్వారా ఆర్థిక సేవల విభాగం (DFS) పరిశీలనకు పంపినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఉన్నత స్థాయిలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

UPI MDR Petrol Pumps | కొత్త నిబంధనలు ఇవే..

వచ్చే నెల అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం రూ.2,000 కంటే తక్కువ లావాదేవీలపై ఎలాంటి ఎండీఆర్ ఉండదు. అయితే రూ.2,000 దాటిన సాధారణ పీ2ఎం (Person-to-Merchant) లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ విధిస్తుండగా, ఇంధన విక్రయాలు, రైల్వే టికెట్లు, ఇన్సూరెన్స్ వంటి ప్రత్యేక రంగాల చెల్లింపులపై ప్రతి లావాదేవీకి ఫ్లాట్‌గా రూ.5 చొప్పున ఛార్జ్ వర్తిస్తుందని ఎన్‌పీసీఐ (NPCI) ప్రకటించింది.

ఈ అదనపు ఛార్జీల భారం కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంక్ డీలర్లు రూ.2,000కు మించి యూపీఐ చెల్లింపులను నిలిపివేస్తామని హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇది కూడా చదవండి:  CJP Gyanesh Kumar | సీఈసీ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో రాజీనామా చేయాలి: సీజేపీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *