అక్షరటుడే వెబ్డెస్క్: Telangana Maoist Areas | తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు ఇన్నాళ్లూ మావోయిస్టుల ప్రాబల్యం కారణంగా అభివృద్ధికి నోచుకోలేదని, ప్రస్తుతం రాష్ట్రంలో మావోయిస్టుల మనుగడ లేకుండా వారి కంచుకోటను ఖాళీ చేశామని డీజీపీ సీవీ ఆనంద్ ( CV Anand) అన్నారు. ఈ కారణంగానే ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఇప్పుడు అభివృద్ధి అడుగులు పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన సోమవారం కర్రేగుట్టల్లో పర్యటించారు.
Telangana Maoist Areas | రహదారి పనుల పరిశీలన..
తొలుత పామునూరు బేస్ క్యాంపునకు చేరుకున్న డీజీపీకి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం అక్కడ నివాసం ఉంటున్న పామునూరు గ్రామస్థులతో ఆయన మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అక్కడి నుంచి కర్రేగుట్టల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. పామునూరు, చెలిమల, డోలి, తడపాల మీదుగా సుమారు 30 కిలోమీటర్ల మేర నిర్మించిన కొత్త రహదారిని పరిశీలించి, పనుల్లో అనుసరించాల్సిన విధానాలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
Telangana Maoist Areas | పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం..
ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. మావోయిస్టుల అణచివేతలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి వ్యూహాత్మకంగా అడుగులు వేశామని తెలిపారు. మావోయిస్టుల కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలను ఖాళీ చేయించామని, కొందరు ఎన్కౌంటర్లలో మృతి చెందగా.. ప్రభుత్వం తీసుకొచ్చిన పునరావాస విధానాల వల్ల భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా అందించామన్నారు. త్వరలోనే ఈ అటవీ ప్రాంతాన్ని, అటవీశాఖతో కలిసి అందమైన పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
డీజీపీ పర్యటన నేపథ్యంలో స్థానిక పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Fishermen Accident Insurance | మత్స్యకారులకు ప్రభుత్వం భరోసా.. రూ.5 లక్షల ప్రమాద బీమా