అక్షరటుడే, వెబ్డెస్క్ : Fishermen Accident Insurance | మత్స్యకారులకు అండగా ఉంటామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు 4.21 లక్షలకుపైగా నమోదిత మత్స్యకారులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ప్రమాదవశాత్తు మరణం, వికలాంగతకు రూ.5 లక్షల వరకు బీమా రక్షణ కల్పించనుంది.
మత్స్యకారుల సామాజిక భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రంలోని 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు గ్రూప్ ప్రమాద బీమా పథకం (GAIS) అమలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్యానికి గురైన మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈ గ్రూప్ ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.
Fishermen Accident Insurance | ఉచితంగా బీమా
రాష్ట్రంలో 2026-27 సంవత్సరంలో 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల 4,21,767 మంది నమోదిత మత్స్యకారులు ఈ పథకం పరిధిలోకి వస్తారని మంత్రి వెల్లడించారు. ఒక్కో లబ్ధిదారునికి రూ.79.96 బీమా ప్రీమియం ఉండగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో ప్రీమియం భరిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.21,34,79,673 చెల్లిస్తుందని, తద్వారా అర్హులైన మత్స్యకారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు.
Fishermen Accident Insurance | బీమా ప్రయోజనాలు
మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబానికి రూ.5 లక్షలు అందిస్తారు. శాశ్వత పూర్తి వైకల్యానికి రూ.5 లక్షలు, శాశ్వత పాక్షిక వైకల్యానికి – రూ.2.50 లక్షలు సాయం చేస్తారు. ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చికిత్స పొందితే గరిష్ఠంగా రూ.25,000 వరకు వైద్య సహాయం అందనుంది. 2026 జూన్ 1 నుంచి ఈ పాలసీ అమలులోకి వచ్చినట్లు మంత్రి తెలిపారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రమాద సమయంలో అండగా నిలవడంతో పాటు, వారి భవిష్యత్తుకు ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి : CV Anand Warning | ఎవరా నలుగురు IPS లు.. వారి బదిలీ ఖాయమేనా..!