World Heart Day Hyderabad | గుండెపోటుకు చెక్ పెట్టేలా సిటిజెన్స్ హాస్పిటల్స్ యత్నం… ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ద్వారా తక్షణ వైద్య సలహాలు

ప్రపంచ హృదయ దినోత్సవం 2026 సందర్భంగా నల్లగండ్లలోని సిటిజెన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: World Heart Day Hyderabad | ప్రపంచ హృదయ దినోత్సవం 2026 సందర్భంగా నల్లగండ్లలోని సిటిజెన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గుండె ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చింది. “ఒక్క హృదయ స్పందనను కూడా నిర్లక్ష్యం చేయకండి. అవగాహన కలిగిన పౌరుడిగా ఉండండి” అనే నినాదంతో గుండె జబ్బుల నివారణ, అత్యవసర సమయాల్లో అనుసరించాల్సిన విధానాలపై కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బేసిక్ లైఫ్ సపోర్ట్ (BLS), కార్డియోపల్మనరీ రిససిటేషన్ (CPR) శిక్షణలతో పాటు, నిపుణుల సలహాలు అందించేందుకు ప్రత్యేకంగా ‘ఈ-హార్ట్ సిటిజెన్స్’ (E-Heart, Citizens) అనే వాట్సాప్ కమ్యూనిటీని ప్రారంభించారు.

World Heart Day Hyderabad |  విస్తృత సేవలు..

గత ఏడాది కాలంలో సిటిజెన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తన వైద్య సేవల పరిధిని ఆసుపత్రి గోడల దాటి విస్తరించింది. విద్యా సంస్థలు, నివాస సముదాయాలు, ఆఫీసులు, వివిధ కమ్యూనిటీలలో సుమారు 1,350కి పైగా బీఎల్‌ఎస్, సీపీఆర్ శిక్షణా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించింది. ఎమర్జెన్సీ సమయాల్లో గుండె సమస్యలను గుర్తించడం, తక్షణమే సీపీఆర్ అందించడం ద్వారా వైద్య సహాయం అందే వరకు ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన ఆచరణాత్మక జ్ఞానాన్ని పౌరులకు ఈ కార్యక్రమాల ద్వారా అందిస్తున్నారు. కేవలం అవగాహనకే పరిమితం కాకుండా, ఆపద సమయంలో స్పందించేలా ప్రజలను సన్నద్ధం చేయడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశం.

World Heart Day Hyderabad | ప్రతి నిమిషం ఎంతో కీలకం..

ఈ కార్యక్రమంపై సిటిజెన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ , అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ సౌత్ వైస్ ప్రెసిడెంట్ & రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డా. ప్రభాకర్ పాలచర్ల మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో పనిచేసే వయస్సులోనే గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా మారుతోందన్నారు. ఎమర్జెన్సీ సమయంలో తొలి కొన్ని నిమిషాలు ఎంతో కీలకమని, ఆ సమయంలో తీసుకునే చొరవ ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు. ప్రజలందరూ ప్రథమ స్పందనదారులుగా (First Responders) తయారై, అవసరమైన వారికి సాయం చేసేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ వైద్య కార్యక్రమానికి సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ జానపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సందీప్ ఖంభంపాటి, సీనియర్ కార్డియోథొరాసిక్ & హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ గిరిధర్ హెచ్‌లు నాయకత్వం వహిస్తున్నారు. విద్యా సంస్థల్లోని సిబ్బందికి, వివిధ సంస్థల ఉద్యోగులకు శిక్షణ ఇస్తూ కార్పొరేట్, సామాజిక వర్గాలలో ఈ అవగాహనను మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు.

World Heart Day Hyderabad | వాట్సాప్ కమ్యూనిటీ ప్రత్యేకత..

పౌరులకు మరింత మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేలా ఆసుపత్రి ‘E-Heart, Citizens’ వాట్సాప్ గ్రూప్‌ను పరిచయం చేసింది. ఈ కమ్యూనిటీ ద్వారా వైద్యులు, హెచ్‌ఆర్ ఎస్పీఓసీలు, ఈసీ మెంబర్లను కార్డియాలజీ నిపుణుల బృందంతో అనుసంధానిస్తారు. దీనివల్ల గుండె సంబంధిత సందేహాలు, ఎమర్జెన్సీ అభిప్రాయాలు , నిపుణుల మార్గదర్శకత్వం తక్షణమే లభిస్తాయి. వైద్య రంగానికి, సంస్థల భాగస్వాములకు మధ్య సమన్వయం పెంచడంతో పాటు సకాలంలో వైద్య సాయం అందించేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది.

గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, అత్యవసర సమయాల్లో స్పందించే నైపుణ్యాలను నేర్చుకోవాలని సిటిజెన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కోరుతోంది. ఒక్క హృదయ స్పందనను కూడా నిర్లక్ష్యం చేయకుండా, చైతన్యవంతమైన పౌరులుగా నిలవాలని ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చింది.

ఇది కూడా చదవండి:  BJYM District Secretary | బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా దేవానాయక్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *