అక్షరటుడే, కామారెడ్డి: TGSRTC Union Elections | ఆర్టీసీ (TGSRTC) ఎన్నికల్లో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ చరిత్ర సృష్టించబోతుందని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు అన్నారు. కామారెడ్డి (Kamareddy) ఆర్టీసీ డిపోలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.
TGSRTC Union Elections | 2017లో యూనియన్ స్థాపించినప్పుడే..
2017లో యూనియన్ స్థాపించినప్పుడే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 95 డిపోలు తిరిగిన చరిత్ర తమ యూనియన్‌కు ఉందన్నారు. మేనిఫెస్టోలో కూడా విలీనం అంశాన్ని పెట్టించిన ఘనత తమదేనని చెప్పారు. ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం అయితే ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే అన్ని వసతులు లభిస్తాయని, మార్పు కోసమే తాము ఆ డిమాండ్ పెట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విలీన డిమాండ్ ఊపందుకున్న తరుణంలో ప్రభుత్వం విలీనానికి ముందుకు వస్తే కొన్ని యూనియన్లు కుట్రపూరితంగా ఎన్నికలకు వెళ్లాయని విమర్శించారు. రిటైర్డ్ అయ్యే వాళ్లు ప్రభుత్వంలో విలీనం అయితే ఉండరని భావించి విలీనం వద్దంటూ ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నారని, అశ్వథామ రెడ్డి, వీఎస్ రావు లాంటి వాళ్లు వసూళ్లు, దందాలు చేసుకోవడానికే కుటిల యత్నంతో ఎన్నికలు తీసుకువచ్చారని ఆరోపించారు.
TGSRTC Union Elections | 400మంది ఉద్యోగులు మృతి చెందితే..
ఉద్యోగులు ఇబ్బందులు పడుతుంటే ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ పట్టించుకోలేదని, 400 మంది ఉద్యోగులు చనిపోతే వారికి నేటికీ ఏరియర్స్ రాలేదన్నారు. 2017 బకాయిలు, 2023 వేతన సవరణ బకాయిలు రిటైర్ అయ్యాక ఇస్తామంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి యూనియన్లకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఎంప్లాయీస్ యూనియన్, టీఎంయూ, ఎన్ఎంయూ విరోధులుగా ఉన్నారని, ఇవాళ అన్ని యూనియన్లు జతకట్టాయంటే వారి ఉద్దేశం ఏమిటో ఆర్టీసీ ఉద్యోగులు గుర్తించాలని కోరారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆర్టీసీలో సమూల మార్పులు తీసుకువస్తామని, చట్ట వ్యతిరేక డ్యూటీలు, వేధింపులను దూరం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు డీవీకే రావు, సీజనల్ వైస్ ప్రెసిడెంట్ పి. శీనయ్య, నిజామాబాద్ రీజనల్ చైర్మన్ అన్వర్, డిపో అధ్యక్షుడు భాస్కర్, సెక్రెటరీ ఎంఐ అలీ, నాయకులు నాగరాజు, బాలకిషన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: శిలా తోరణం వరకు.. తిరుమలలో భక్తుల రద్దీ