Ujjal Bhuyan Voting Rights | ఓటును వేరు చేయడం అంటే ఆత్మను వేరు చేసినట్లే.. జస్టిస్ ఉజ్జల్ సంచలన వ్యాఖ్యలు

భారత పౌరుల ఓటు హక్కును హరించే ఎలాంటి ప్రక్రియ అయినా సరే, అది రాజ్యాంగ వ్యవస్థను, దాని ఆత్మను దెబ్బతీయడమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అత్యంత ఘాటుగా హెచ్చరించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Ujjal Bhuyan Voting Rights | భారత పౌరుల ఓటు హక్కును హరించే ఎలాంటి ప్రక్రియ అయినా సరే, అది రాజ్యాంగ వ్యవస్థను, దాని ఆత్మను దెబ్బతీయడమేనని సుప్రీంకోర్టు  ( Supreme court )న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అత్యంత ఘాటుగా హెచ్చరించారు. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నల్సార్ (NALSAR) న్యాయ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపడుతున్న ఓట్ల సవరణ (SIR) ప్రక్రియ ద్వారా పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారనే వివాదాలు నడుస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ కామెంట్స్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Ujjal Bhuyan Voting Rights | ద్వితీయ శ్రేణి పౌరులుగా ..

ఏ కారణం చేతైనా సరే కోట్లాది మంది ప్రజలు తమ ప్రాథమిక ఓటు హక్కును కోల్పోయి, తమ సొంత దేశంలోనే ద్వితీయ శ్రేణి పౌరులుగా మారే దుస్థితి వస్తే దానిని ఏ వాదనతోనూ సమర్థించలేమని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 తో ఏ అధికార వ్యవస్థ కూడా ఆటలాడకూడదని, రాజ్యాంగం కంటే ఏ సంస్థ లేదా వ్యవస్థ కూడా గొప్పది కాదని ఆయన తేల్చి చెప్పారు.

Ujjal Bhuyan Voting Rights | ఆత్మను వేరు చేసినట్లే..

పౌరుడి అస్తిత్వం నుంచి ఓటు హక్కును లేదా ఓటర్ల జాబితాలో ఉండే హక్కును వేరు చేయలేమని.. “అలా చేయడం మనిషి శరీరం నుంచి ఆత్మను వేరు చేయడంతో సమానం” అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అభివర్ణించారు. చనిపోయిన వ్యక్తుల విషయంలో మినహా, ఓటర్ల జాబితాలో ఉన్న ఏ సాధారణ పౌరుడి ఓటునైనా ముందస్తు నోటీసులు లేదా సమగ్ర విచారణ జరపకుండా తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు.

Ujjal Bhuyan Voting Rights | రాజ్యాంగ ఉల్లంఘనే..

దేశంలో ఒకరు కుబేరుడైనా, మరొకరు రిక్షా కార్మికుడైనా సరే ప్రతి ఒక్కరి ఓటు విలువ సమానమని, అదే రాజ్యాంగం తీసుకొచ్చిన తొలి మార్పు అని పేర్కొన్నారు. పౌరుల ఓటు హక్కును హరించడం అనేది రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 326 (సార్వత్రిక వయోజన ఓటు హక్కు) ఉల్లంఘన కిందకే వస్తుందని ఆయన  నొక్కిచెప్పారు.

ఇది కూడా చదవండి:  Bheemgal Tea Seller | పోలీస్​ స్టేషన్ ఎదుట చాయ్​ హోటల్​ నిర్వాహకుడి ఆత్మహత్యాయత్నం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *