అక్షరటుడే, భీమ్‌గల్: Bheemgal Tea Seller | చాయ్ హోటల్ నిర్వాహకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన భీమ్‌గల్ పోలీస్‌స్టేషన్ ఎదుట సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది..
Bheemgal Tea Seller | బస్టాండ్ సమీపంలో చాయ్ విక్రయిస్తూ..
భీమ్‌గల్ (Bheemgal) బస్టాండ్ సమీపంలో టీ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న ఒక పేద చిరు వ్యాపారిపై పోలీసులు ప్రదర్శించిన తీరు కలకలం రేపింది. రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో చాయ్ అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకునే పొలాస సుధాకర్ అనే వ్యాపారిని ‘లేట్ నైట్ టీలు అమ్ముతున్నావ్’ అంటూ రెండు మూడు రోజులుగా స్థానిక పోలీసులు తీవ్ర వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది.
Bheemgal Tea Seller | కేసులతో మనస్తాపం
ఈ చిరు వ్యాపారిపై పోలీసులు రాత్రివేళ వ్యాపారం చేస్తున్నావనే నెపంతో ఇప్పటికే మూడుసార్లు పిటీ (PT) కేసులు నమోదు చేశారు. తాజాగా నాలుగోసారి కూడా పిటీ కేసు నమోదు చేసి ఫైన్ వేయడమే కాకుండా, పోలీస్ స్టేషన్‌కు రావాలని పిలవడంతో సుధాకర్ తీవ్ర మనస్తాపానికి, భయాందోళనకు గురయ్యాడు. పదేపదే వేసే ఫైన్ల భయం తాళలేక, తీవ్ర ఆవేదనతో పెట్రోల్ క్యాన్ తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన సుధాకర్, ‘కష్టపడి బతుకుతున్న నన్ను ఎందుకు సతాయిస్తున్నారు? పదేపదే నాపైనే కేసులు ఎందుకు పెడుతున్నారు? మీ జరిమానాలు నేనెలా కట్టాలి?’ అని నిలదీస్తూనే, అందరూ చూస్తుండగానే తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు.
Bheemgal Tea Seller | ‘పోలీసుల వేధింపుల వల్లే..’ బాధితుడి వీడియో
ఆత్మహత్యాయత్నం అనంతరం తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడు సుధాకర్ మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం బయటకు వచ్చి తీవ్ర కలకలం రేపుతోంది. ‘పోలీసులు నన్ను విపరీతంగా వేధిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు జరిమానాలు చెల్లించాను. నా పరిస్థితి తెలిసి కూడా నన్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. ఇప్పుడు మూడోసారి కూడా ఫైన్ వేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేశాను’ అని బాధితుడు ఆ వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు. మంటలు అంటుకున్న సుధాకర్‌ను గమనించిన స్థానికులు, పోలీసులు మంటలను ఆర్పి అత్యవసర చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలిసింది. బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తూ భీమ్‌గల్ పట్టణంలోని సుమంగళి చౌరస్తా వద్ద ధర్నాకు దిగారు. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
ఇదికూడా చదవండి: Red Cross Society Nizamabad | రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఇందూరు సేవా సమితి ప్యానెల్ విజయం