Surya Fleet Support Ship | రక్షణ రంగంలో చారిత్రక ఘట్టం.. తొలి స్వదేశీ ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా రక్షణ రంగంలో మరో మైలురాయి నమోదైంది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL)లో నిర్మించిన భారత నౌకాదళ తొలి స్వదేశీ ఫ్లీట్ సపోర్ట్ షిప్ (FSS-1) ‘సూర్య’ జలప్రవేశం చేసింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Surya Fleet Support Ship | ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వేదికగా రక్షణ రంగంలో మరో మైలురాయి నమోదైంది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL)లో నిర్మించిన భారత నౌకాదళ తొలి స్వదేశీ ఫ్లీట్ సపోర్ట్ షిప్ (FSS-1) ‘సూర్య’ జలప్రవేశం చేసింది. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దేశీయ నౌకా నిర్మాణ రంగంలో ఇది అత్యంత కీలకమైన ముందడుగు అని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. నౌకల తయారీలో హిందుస్థాన్ షిప్‌యార్డ్ ప్రదర్శిస్తున్న సామర్థ్యాలు భారత్ స్వయంశక్తిని, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రశంసించారు. నావల్ డాక్‌యార్డ్, హెచ్‌ఎస్‌ఎల్ వంటి సంస్థలు నౌకల నిర్మాణం, నిర్వహణలో అద్భుతంగా పనిచేస్తున్నాయని, వీటి ద్వారా స్థానిక ఎంఎస్ఎంఈ (MSME) పరిశ్రమలకు కూడా ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని తెలిపారు.

Surya Fleet Support Ship | ‘సూర్య’ ప్రత్యేకతలు..

హెచ్‌ఎస్‌ఎల్‌లో నిర్మిస్తున్న ఈ ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లు దాదాపు 43,500 టన్నుల భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సముద్రంలో సుదూరంగా ఉండే యుద్ధ నౌకలకు అవసరమైన ఇంధనం, ఆహారం, ఇతర వస్తువులను ఎప్పటికప్పుడు అందిస్తూ.. నౌకాదళం సముద్రంలో ఎక్కువ కాలం నిలకడగా ఉండేందుకు ఈ నౌకలు ఎంతగానో తోడ్పడతాయి. ఎఫ్‌ఎస్‌ఎస్‌-1 (FSS-1) స్టీల్ కటింగ్ చేపట్టిన కేవలం 18 నెలల స్వల్ప వ్యవధిలోనే బంగాళాఖాతంలోకి ప్రవేశించడం మన దేశ నౌకా నిర్మాణ వేగ ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.

ఇదే కార్యక్రమంలో ఫ్లీట్ సపోర్ట్ షిప్-5 (FSS-5)కి కీల్ (Keel) వేశారు. అలాగే అప్‌గ్రేడ్ చేసిన స్లిప్‌వే-4, 300 టన్నుల గోలియత్ క్రేన్‌ను రక్షణ మంత్రి ప్రారంభించారు. ఈ ఆధునిక మౌలిక వసతుల వల్ల భవిష్యత్తులో 45,000 డెడ్‌వెయిట్ టన్నుల వరకు సామర్థ్యం కలిగిన పెద్ద నౌకలను సులభంగా నిర్మించే వీలు కలగనుంది.

Surya Fleet Support Ship | వికసిత్ భారత్ లక్ష్యమే ధ్యేయం..

‘ఆత్మనిర్భర్ భారత్’ సంకల్పంతో దేశీయంగానే రక్షణ పరికరాలు, నౌకల తయారీ పెరుగుతుండటంతో ప్రపంచ దేశాల నమ్మకం భారత్‌పై మరింత బలపడుతోందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. అంతర్జాతీయ సముద్ర జలాల పరిరక్షణలో అన్ని నిబంధనలను పాటిస్తూనే, దేశ రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. ఏపీలో మారిటైమ్ రంగ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న సహకారం ఎంతో బాగుందని ఆయన కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా 2047 నాటికి ‘వికసిత్ భారత్’ సాధనలో రక్షణ, నౌకా నిర్మాణ రంగాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన ఆకాంక్షించారు.


ఇది కూడా చదవండి:  Kamareddy ACB Raids | ఏసీబీ, విజిలెన్స్ దాడులు ఉత్తవేనా.. ​కామారెడ్డి బల్దియాలో తనిఖీలపై చర్యలు కరువు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *