Kamareddy ACB Raids | ఏసీబీ, విజిలెన్స్ దాడులు ఉత్తవేనా.. ​కామారెడ్డి బల్దియాలో తనిఖీలపై చర్యలు కరువు

కామారెడ్డి బల్దియాలో ఏసీబీ, విజిలెన్స్​ దాడుల అనంతరం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy ACB Raids | వివాదాలకు.. అవినీతి అక్రమాల ఆరోపణలకు కేరాఫ్ అడ్రస్​గా కామారెడ్డి బల్దియా నిలుస్తోంది. ఇటీవల అధికారులపై వేధింపుల్లో కూడా ముందంజలో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే బల్దియాలో అక్రమాలు, అవినీతిపై ఏసీబీ, విజిలెన్స్​ దాడులు జరిగాయి. కానీ ఆ తనిఖీల అనంతరం అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తనిఖీలు ఉత్తవేనా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

కామారెడ్డి (Kamareddy) మున్సిపల్ కార్యాలయంలో అవినీతి, అక్రమాలపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. చిన్నపాటి బిల్లు రాకున్నా, అధికారులు తాము రూల్ ప్రకారం పనిచేస్తామని చెప్పినా నాయకులకు కోపం వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. తమకు సహకరించని అధికారుల తీరుపై అవినీతి ముద్ర వేసి విజిలెన్స్, ఏసీబీకి ఫిర్యాదులు చేయడం పరిపాటిగా మారిందని టాక్ వినిపిస్తోంది. వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా సంబంధిత శాఖల అధికారులు తనిఖీలు చేపట్టి, చివరి నిమిషంలో ఉన్నతాధికారులకు నివేదిస్తామనే ప్రకటనతో ముగింపు పలుకుతున్నారు.

Kamareddy ACB Raids | చర్యలు శూన్యం

మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్ నివేదికలు ప్రభుత్వానికి చేరాయి. క్షేత్రస్థాయిలో జరిపిన సోదాలు, బిల్లుల ఫైల్స్, ఎంబీ రికార్డులు, స్టేట్‌మెంట్స్ అన్నీ నివేదికల రూపంలో చేరినప్పటికీ, బాధ్యులపై చర్యలు మాత్రం తీసుకోలేదు. కోట్లాది రూపాయల అక్రమాలకు కేరాఫ్ అడ్రస్​గా మారినా చర్యలు తీసుకోకపోవడం వెనుక మతలబు ఏమిటన్న చర్చ బల్దియా వర్గాల్లో సాగుతోంది. బల్దియాలో టార్గెట్ రాజకీయాలు సాగుతున్నాయన్న ప్రచారం నేపథ్యంలోనే ఈ దాడులు చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా క్షేత్రస్థాయి తనిఖీల్లో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దాడులు ఎందుకు చేస్తున్నారు? ఫిర్యాదు చేసిన వారికి లబ్ధి కోసమేనా? తెరవెనుక చక్రం తిప్పిన వారికి లబ్ధి చేకూరిందా? అన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.

Kamareddy ACB Raids | అక్రమాలు వెలుగులోకి..

బీజేపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఎమ్మెల్యే కాకముందు కామారెడ్డి బల్దియాలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఏడాది తర్వాత చేపట్టిన విజిలెన్స్ దాడుల్లో కళ్లు బైర్లు కమ్మే అవినీతి జరిగిందని గుర్తించారన్న ప్రచారం సాగింది. సుమారు మూడు రోజుల పాటు జరిగిన దాడుల నివేదిక ప్రభుత్వానికి చేరినా ఇప్పటికీ చర్యలు లేవు. శానిటేషన్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగాల్లో భారీ అవినీతి జరిగినట్లు, పెట్రోల్, డీజిల్ వాడకున్నా బిల్లులు తీసుకున్నట్లు, అనధికార నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోలేదని, కమర్షియల్ షాపుల రెన్యూవల్ విషయంలో భారీగా నగదు చేతులు మారిందని, దీంతో ప్రభుత్వానికి రూ.కోటి నష్టం వాటిల్లినట్లు ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. కౌన్సిలర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 1న మరోసారి విజిలెన్స్ తనిఖీలు కొనసాగాయి.

Kamareddy ACB Raids | చర్యలకు వెనుకంజ వేస్తున్నారా..?

ఏసీబీ, విజిలెన్స్ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బహిర్గతమయ్యాయని, రూ.కోట్లలో అక్రమాలు జరిగినట్లు తెలుస్తోందని ప్రచారం సాగుతోంది. ఈ స్కాంలో బడా నేతల హస్తం ఉందన్న ప్రచారం కూడా ఉంది. దాంతో నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోకుండా బడా నేతలు రాష్ట్రస్థాయిలో చక్రం తిప్పారన్న ప్రచారం సాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి దాడులు ఎన్ని జరిగినా చివరికి బడా నేతల ఎంట్రీతో ఆగిపోవాల్సిందేనన్న టాక్ వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి: Prashanth Reddy Arrest | మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ముందస్తు అరెస్ట్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *