Illegal Sand Mining | ‘ఇందిరమ్మ’ పేరుతో దర్జాగా ఇసుక దోపిడీ.. మంజీరాను తోడేస్తున్న ఇసుకాసురులు..

ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మంజీరా నదీ పరీవాహక ప్రాంతంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే , కోటగిరి: Illegal Sand Mining | ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మంజీరా నదీ పరీవాహక ప్రాంతంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. పోతంగల్​ మండలంలో ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ అక్రమార్కులు రాత్రింబవళ్లు ఇసుకను తోడేస్తున్నారు. రూ.కోట్లల్లో ఆర్జిస్తున్నారు.

Illegal Sand Mining | పోతంగల్​ మండలంలో..

బోధన్​ నియోజకవర్గంలోని పోతంగల్​ మండలం (Pothangal Mandal)లో మంజీరా పరీవాహక ప్రాంతం ఇసుకాసురులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ ఇసుక రీచ్​లలో అడ్డగోలుగా తవ్వేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. మంజీరాను నమ్ముకుని ఈ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న రైతుల నోట్లో మట్టిగొడుతున్నారు. ఈ ఇసుక మాఫియాకు రెవెన్యూశాఖ అండదండలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.

Illegal Sand Mining | ఇందిరమ్మ పేరుతో.. రైస్​మిల్లులలో డంప్​..

కొందరు వ్యక్తులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో అనుమతులు తీసుకుని అడ్డగోలుగా ట్రాక్టర్లలో మంజీరా నుంచి ఇసుకును తోడుతున్నారు. ఈ ఇసుకను రైస్​మిల్లులలో డంప్​ చేస్తున్నారు. అనంతరం రాత్రివేళ్లలో అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ తతంగమంతా అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవట్లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

Illegal Sand Mining | సుంకిని, కొడిచెర్ల మీదుగా..

పోతంగల్​ మండలంలో కల్లూరు నుంచి పోతంగల్​, కొడిచెర్ల, హంగర్గ, కారేగాం, సుంకిని వరకు సువిశాలమైన మంజీరా పరివాహక ప్రాంతం ఉంది. దీంట్లో కొడిచెర్లలో మాత్రం రెవెన్యూ రికార్డుల ప్రకారం 600 ఎకరాల పరీవాహక ప్రాంతం ఉంది. పోతంగల్​ మండలంలోని రాంగంగానగర్​లో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్​ స్కూల్ నిర్మాణాన్ని ఇటీవల కలెక్టర్ పరిశీలించారు. ఈ నిర్మాణానికి ఇసుక రవాణను అధికారికంగా అనుమతించారు. దీంతో టీజీఎండీసీ ఆధ్వర్యంలో టిప్పర్ల ద్వారా ఇసుక రవాణా జరుగుతోంది. ఇదే క్రమంలో ఇతరులు సైతం రాత్రివేళల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

Illegal Sand Mining | రాత్రింబవళ్లు యథేచ్ఛగా..

పోతంగల్​ మండల పరిధిలో ఇసుక రవాణా రాత్రీపగలు కొనసాగుతోంది. గతంలో అనేకసార్లు ఆయా గ్రామాల ప్రజలు ఈ టిప్పర్లు, ట్రాక్టర్లను అడ్డుకుని నిరసన వ్యక్తం చేసినప్పటికీ కొన్నిరోజులు ఆగిన ఈ దందా మళ్లీ ఎప్పటిలాగే కొనసాగుతోంది. గ్రామస్తులు అడ్డుచెప్పినప్పుడు ఉదయం, మధ్యాహ్నం ఆగిన రవాణా.. రాత్రిళ్లలో ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఈ ఇసుక రవాణాను పూర్తిస్థాయిలో అడ్డుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Illegal Sand Mining | ఏకంగా 11 ట్రాక్టర్లు సీజ్​..

సుంకిని గ్రామ శివారు నుంచి ఈనెల 4వ తేదీన రాత్రివేళ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో మూడు ఇసుకతో నిండిన ట్రాక్టర్లను, అలాగే ఇసుకను నింపుకునేందుకు సిద్ధంగా ఉన్న మరో 8 ట్రాక్టర్లను సీజ్​ చేశారు. పట్టుకున్న ట్రాక్టర్లను కోటగిరి పోలీస్​స్టేషన్​కు తరలించారు. ట్రాక్టర్లపైనా, వాటి డ్రైవర్లు, ఓనర్లపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపినట్లు ఎస్సై శ్రీనివాస్​ యాదవ్​ తెలిపారు. అయితే పోలీసులు చర్యలు తీసుకుంటున్న రెవెన్యూశాఖలో కిందిస్థాయి సిబ్బంది అండతో ఈ దందా విచ్చలవిడిగా సాగుతోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

Illegal Sand Mining | ఉపేక్షించేది లేదు..

ఇసుక అక్రమ రవాణా చేస్తే ఊపేంక్షించేది లేదు. అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తు కఠిన చర్యలు తీసుకుంటాం. వాల్టా చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తాం. అధికారికంగా మాత్రమే ఇసుక రవాణాకు అవకాశం ఉంది. ఎక్కడైనా మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఇస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– సందీప్​, తహశీల్దార్, పోతంగల్​​

ఇది కూడా చదవండి..: Kamareddy ACB Raids | ఏసీబీ, విజిలెన్స్ దాడులు ఉత్తవేనా.. ​కామారెడ్డి బల్దియాలో తనిఖీలపై చర్యలు కరువు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *