అక్షరటుడే వెబ్డెస్క్: Indiramma Houses Towers | మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం గాజులరామారంలో పేదల సొంతింటి కల సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. సర్వే నెం. 346 పరిధిలో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన ప్రతిష్టాత్మక ‘ఇందిరమ్మ ఇండ్ల టవర్స్’ నిర్మాణ పనులకు మంగళవారం ఘనంగా భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ వేడుకలో జిల్లా ఇన్ఛార్జ్, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రత్యేకించి, లబ్ధిదారులైన మహిళల చేతుల మీదుగానే భూమిపూజ నిర్వహించడం ఈ కార్యక్రమంలో హైలైట్గా నిలిచింది.
Indiramma Houses Towers | ఒక్కో అంతస్తుకు 12 ఫ్లాట్ల చొప్పున..
గాజులరామారంలో సుమారు 2.60 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మొదటి విడతలో భాగంగా ‘స్టిల్ట్ + 10 అంతస్తుల’ (S+10) శైలిలో అత్యాధునిక వసతులతో 4 టవర్లను నిర్మిస్తున్నారు. ఒక్కో అంతస్తుకు 12 ఫ్లాట్ల చొప్పున మొత్తం 480 నివాస యూనిట్లను సిద్ధం చేస్తున్నారు. కామన్ ఏరియాతో కలిపి ఒక్కో ఇల్లు 528.58 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండనుంది. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పిల్లల ఆటస్థలం, వాణిజ్య సముదాయాలు, ఓపెన్ పార్కింగ్తో పాటు విశాలమైన అంతర్గత రోడ్లను ఏర్పాటు చేస్తున్నారు.
Indiramma Houses Towers | పారదర్శక ఎంపిక..
ఈ ఇళ్ల కేటాయింపులో ఎలాంటి పైరవీలకు తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించామని మంత్రులు స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అందిన 7 వేలకు పైగా దరఖాస్తులను పరిశీలించి 5,200 మందిని అర్హులుగా గుర్తించామని.. వారి సమక్షంలోనే బహిరంగ డ్రా ద్వారా 480 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. ఆన్లైన్ ద్వారానే కేటాయింపులు పూర్తి చేసి, ఎవరికి ఏ ఫ్లోర్లో ఫ్లాట్ వచ్చిందో అక్కడికక్కడే సర్టిఫికెట్లు అందజేశారు. దాదాపు రూ. 48 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ నిర్మాణాలను సరిగ్గా 12 నెలల్లోనే పూర్తి చేసి లబ్ధిదారులకు తాళాలు అప్పగిస్తామని హామీనిచ్చారు. నిర్ణీత గడువు కంటే ముందే పనులు పూర్తి చేసే కాంట్రాక్టర్లకు ప్రత్యేక బోనస్లు ప్రకటించామని, నాణ్యతా ప్రమాణాలను లబ్ధిదారులే స్వయంగా పరిశీలించుకోవచ్చని పేర్కొన్నారు.
Indiramma Houses Towers | కోట్ల విలువైన భూమి..
హైదరాబాద్లో స్థలాల ధరలు సామాన్యులకు అందనంతగా పెరిగిన నేపథ్యంలో, పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందని మంత్రులు వెల్లడించారు. కూకట్పల్లి, బాచుపల్లి, నిజాంపేట్ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గాజులరామారంలో వందల కోట్ల విలువైన భూమిని పేదల నివాసాల కోసం కేటాయించామని మంత్రి శ్రీధర్ బాబు గుర్తుచేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 23 అర్బన్ నియోజకవర్గాల్లో తొలి విడతగా 480 ఇళ్లతో ఈ టవర్లను నిర్మిస్తున్నామని.. మొదటి విడతలో అవకాశం రాని అర్హులందరికీ రాబోయే విడతల్లో తప్పకుండా ఇళ్లు కేటాయిస్తామని భరోసా ఇచ్చారు.
LIVE | Hon’ble Minister Ponguleti Srinivasa Reddy Garu participated as the chief guest at the foundation-laying ceremony for the Indiramma Indlu Towers in Gajularamaram, Quthbullapur, Medchal-Malkajgiri district
https://t.co/JAvgTfs4wS
— Ponguleti Srinivasa Reddy (@INC_Ponguleti) October 6, 2026
ఇది కూడా చదవండి: Kavitha Vemulawada Issues | కాళేశ్వరం నీళ్లు ఏవి?.. వేములవాడ, సిరిసిల్ల సమస్యలపై కల్వకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం