అక్షరటుడే వెబ్‌డెస్క్: Ayodhya Ram Mandir CEO | అయోధ్య రామ మందిర ట్రస్ట్ తొలి పూర్తిస్థాయి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర ( Jitendra Mishra ) మిశ్రా నియమితులయ్యారు. బుధవారం అయోధ్యలో జరిగిన రామ మందిర ట్రస్ట్ సమావేశం అనంతరం ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. 5 వేల మందికి పైగా దరఖాస్తుదారుల నుంచి కఠినమైన ప్రక్రియ ద్వారా ఆయనను ఈ పదవికి ఎంపిక చేశారు. భారత వాయుసేనలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన జితేంద్ర మిశ్రా.. గతంలో ఆపరేషన్ సిందూర్ సమయంలో వెస్ట్ కమాండ్ చీఫ్‌గా వ్యవహరించారు. ఆలయ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది.
Ayodhya Ram Mandir CEO | ఏఐ (AI) ద్వారా ఎంపిక..
జితేంద్ర మిశ్రా ఎంపిక కోసం ట్రస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్క్రీనింగ్‌తో పాటు మాన్యువల్ పరిశీలనను పకడ్బందీగా నిర్వహించింది. మొత్తం 600 మార్కులతో మూల్యాంకన విధానాన్ని రూపొందించి.. తొలి దశలో 3,577 మందిని పరిశీలించారు. ఇందులో 470కి పైగా మార్కులు సాధించిన 108 మందితో వర్చువల్ ఇంటర్వ్యూలు నిర్వహించి, చివరికి 16 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు. ఆగస్టు 11, 12 తేదీల్లో అయోధ్యలో జరిగిన ముఖాముఖి ఇంటర్వ్యూల ఆధారంగా ముగ్గురిని తుది జాబితాకు ఎంపిక చేయగా.. వారిలో జితేంద్ర మిశ్రాను తొలి సీఈవోగా ఖరారు చేశారు.
Ayodhya Ram Mandir CEO | ట్రస్ట్ సమావేశంలోని అంశాలు..
ఆలయ విరాళాల నిధుల దుర్వినియోగ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేయగా, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ నివాసంలో జరిగిన ఈ సమావేశానికి కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి సహా పలువురు ముఖ్య ట్రస్టీలు హాజరయ్యారు. ఈ భేటీలో ఖాళీగా ఉన్న మూడు ట్రస్టీ పదవుల భర్తీ, కొత్త సీఈవో అధికారాలు, బాధ్యతల నిర్ధారణపై చర్చించారు. అలాగే ఆలయ నిర్వహణను సజావుగా సాగించడం, స్థానిక అధికారులతో కలిసి భద్రతా ఏర్పాట్లను సమన్వయం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
ఇది కూడా చదవండి: Konda Surekha Comments | సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు