అక్షరటుడే, వెబ్‌డెస్క్ : AI awareness | మారుతున్న కాలానికి అనుగుణంగా మంత్రులు కృత్రిమ మేధ (AI), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT)పై అవగాహన పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సూచించారు. క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం తాజా రాజకీయ, పరిపాలనా అంశాలపై మంత్రులతో ఆయన ప్రత్యేకంగా చర్చించారు. సాంకేతికతను అందిపుచ్చుకోకపోతే వెనుకబడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
AI awareness | భవిష్యత్తు అంతా ఏఐపైనే..
రాష్ట్రానికి గూగుల్ (Google) వంటి దిగ్గజ సంస్థలను తీసుకురావడానికి పడిన కష్టాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. అమెరికా పర్యటనలో మంత్రి లోకేశ్ (Nara Lokesh) గూగుల్ ప్రతినిధులతో జరిపిన చర్చలు, వారిని ఒప్పించిన తీరును సహచర మంత్రులకు వివరించారు. భవిష్యత్తు అంతా ఏఐపైనే ఆధారపడి ఉంటుందని, అందుకే ప్రతి మంత్రి దీనిపై దృష్టి సారించాలని కోరారు.
AI awareness | ప్రజలకు ఇబ్బందులు లేకుండా
రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘జలధార- జలహారతి’ కార్యక్రమంలో మంత్రులందరూ భాగస్వాములు కావాలని మంత్రి నిమ్మల రామానాయుడుకు సూచించారు. ‘సూర్యఘర్’ పథకం లక్ష్యాలను చేరుకోవడంలో మరింత చురుగ్గా పనిచేయాలని మంత్రి గొట్టిపాటి రవికి సూచించారు. పుట్టపర్తి ఏరోస్పేస్ డిఫెన్స్ క్లస్టర్‌కు వేగంగా అనుమతులు రావడం మన ప్రభుత్వ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు నిదర్శనమని పేర్కొన్నారు. ఇటీవల సింగపూర్ వెళ్లి వచ్చిన మంత్రులు అక్కడ గమనించిన ఉత్తమ విధానాలపై వ్యక్తిగత నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.
AI awareness | అసత్య ప్రచారాలను ఎండగట్టాలి
రాజధాని అమరావతి నిర్మాణ ఖర్చులపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని చంద్రబాబు మంత్రులకు పిలుపునిచ్చారు. అమరావతి భవనాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వాస్తవాలతో సమాధానం చెప్పాలన్నారు. మంత్రుల సింగపూర్ పర్యటనపై వస్తున్న విమర్శలను దీటుగా ఎదుర్కోవాలని, అక్కడ నేర్చుకున్న పరిజ్ఞానం రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుతుందో ప్రజలకు వివరించాలని చెప్పారు. ఇటీవల తలెత్తిన ఇంధన కొరత వంటి అంశాలపై ప్రజలకు నిజాన్ని వివరించి, విపక్షాల అసత్యాలను అడ్డుకోవాలని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి : TDP Working President | టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోకేశ్ ప్రమాణం

