అక్షరటుడే వెబ్డెస్క్: HPV Vaccine for Girls | మహిళల ప్రాణాలను తీస్తున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ( Cervical Cancer ) మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిపుణులు అత్యంత కీలకమైన సిఫార్సులు చేశారు. 4 నుంచి 8 ఏళ్ల వయస్సున్న చిన్నారి బాలికలకు హ్యూమన్ పాపిలోమావైరస్ (HPV) వ్యాక్సిన్ వేయాలని నిపుణుల బృందం సూచించింది. భవిష్యత్తులో ఈ ఘోర క్యాన్సర్ బారిన పడకుండా చిన్న వయసులోనే రోగనిరోధక శక్తిని పెంచి రక్షణ కల్పించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.
HPV Vaccine for Girls | క్యాన్సర్కు చెక్..
సిర్వికల్ క్యాన్సర్ సంభవించడానికి ప్రధాన కారణమైన హెచ్పీవీ వైరస్ను ప్రారంభ దశలోనే అడ్డుకోవడంలో ఈ వ్యాక్సిన్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మహిళల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు క్యాన్సర్ రహిత సమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా డబ్ల్యూహెచ్ఓ ఈ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కాగా, గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో జాతీయ హెచ్పీవీ వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించింది. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 80 లక్షల మందికి పైగా బాలికలకు టీకాలు విజయవంతంగా అందించారు.
HPV Vaccine for Girls | వ్యాక్సినేషన్ ప్రగతి..
ఈ ఉచిత టీకా పంపిణీ కార్యక్రమంలో పలు రాష్ట్రాలు ఆదర్శవంతమైన పురోగతిని సాధించాయి. ఇందులో 100% రికార్డు కవరేజీతో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ , మిజోరాం రాష్ట్రాలు తమకు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిగా సాధించి ముందంజలో నిలిచాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, బిహార్, అస్సాం రాష్ట్రాలు 90 శాతానికి పైగా ప్రగతితో ముందుండగా, తెలంగాణ రాష్ట్రం ఇప్పటివరకు 60 శాతానికి పైగా వ్యాక్సినేషన్ మార్కును అందుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Karnataka Fire Accident | కర్ణాటకలో భారీ అగ్ని ప్రమాదం