అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy Police Patrolling | జిల్లాలో ‘ఆపరేషన్ కవచ్’ ఫలితాలు (Operation Kavach) పోలీసు శాఖకు ఎనలేని పేరు తీసుకువచ్చాయి. క్లిష్టమైన కేసుల ఛేదన, ముందస్తు చర్యలతో ప్రమాదాలు, చోరీలు జరగకుండా ఆపరేషన్ కవచ్ కట్టడి చేసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అదే ‘ఆపరేషన్ కవచ్’పై ప్రస్తుతం ప్రజల నుంచి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏటీఎం చోరీతో పాటు ఇటీవల జరిగిన ఘటనలు పోలీసు శాఖ ప్రతిష్టకు మచ్చగా మారుతున్నాయన్న చర్చ ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.
Kamareddy Police Patrolling |కామారెడ్డి జిల్లాలో..
కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తున్నారా అనే అనుమానం ప్రజల్లో బలంగా వ్యక్తం అవుతోంది. నేరాల నియంత్రణకు ఆపరేషన్ కవచ్ పేరుతో ప్రత్యేక పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు ఉన్నతాధికారులు ప్రకటించినప్పటికీ, వరుసగా జరుగుతున్న చోరీలు, హత్యలు ఆ ప్రకటనలకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. దీని ఫలితమే పలువురు సిబ్బందిపై ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవడానికి కారణమయ్యాయని ప్రచారం సాగుతోంది.
Kamareddy Police Patrolling | నిఘా వ్యవస్థపై అనుమానాలు
జిల్లాలో పోలీసు నిఘా వ్యవస్థ విఫలమైందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది. రాత్రి 10 గంటల తర్వాత ప్రధాన రహదారుల్లో, కమర్షియల్ ఏరియాల్లో సైరన్తో కూడిన పోలీసు వాహనాలు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నా, పెట్రోలింగ్ లేకపోవడంతో దొంగలు రెచ్చిపోతున్నారని వాపోతున్నారు. ముఖ్యంగా సదాశివనగర్, గాంధారి, కామారెడ్డి పట్టణ పరిధిలో నిఘా కొరవడిందని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
Kamareddy Police Patrolling | వరుస చోరీలతో..
గత వారం రోజుల్లో జిల్లాలో వరుసగా మూడు పెద్ద ఘటనలు జరగడం పోలీసు శాఖకు మచ్చగా మారింది. కోటారి గల్లీలో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలిని ఇంట్లో పని చేసే పనిమనిషి దంపతులే హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లడం, కల్కినగర్లో మహిళ కంట్లో కారం చల్లి చైన్ లాక్కోవడం, ఇప్పుడు గాంధారిలో ఏటీఎం చోరీ.. ఇలా వరుస ఘటనలు శాంతిభద్రతలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా నేరాల రేటు పెరగడం పోలీసు వైఫల్యానికి నిదర్శనంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది.
Kamareddy Police Patrolling | సంచలనం..గాంధారి ఏటీఎం చోరీ
ఆదివారం అర్ధరాత్రి గాంధారి మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో జరిగిన చోరీ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిరోజూ రూ.కోట్లల్లో లావాదేవీలు జరిగే కమర్షియల్ ఏరియాలో ముగ్గురు దొంగలు నైటీల్లో స్కార్పియో వాహనంలో వచ్చి, నిమిషాల వ్యవధిలో ఏటీఎం మిషన్ను ధ్వంసం చేసి ఏకంగా రూ. 25 లక్షల వరకు ఎత్తుకెళ్లడం పోలీసులకు సవాల్గా మారింది. సీసీ కెమెరాల్లో దొంగల ముఖాలు మాస్కులతో కనిపించడం, వారు వాడిన వాహనం నెంబర్ ప్లేట్ లేకుండా ఉండటం దర్యాప్తును మరింత క్లిష్టతరం చేస్తోంది.
Kamareddy Police Patrolling | నిఘా వైఫల్యంపై ఎస్పీ సీరియస్..
ఈ వరుస ఘటనలపై జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తీవ్రంగా స్పందించారు. గాంధారి ఏటీఎం చోరీ ఘటనలో విధుల్లో నిర్లక్ష్యం వహించారని సదాశివ్ నగర్ సర్కిల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న నలుగురు హోంగార్డులను సస్పెండ్ చేశారు. అంతేకాకుండా సదాశివ్ నగర్ పోలీస్ స్టేషన్ ఏఎస్సై జగదీష్, ఏఆర్పీసీ సంజీవరావులకు ఛార్జిమెమోలు జారీ చేశారు. నిఘా వైఫల్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఎస్పీ హెచ్చరించినట్లు సమాచారం.
ఎస్పీ తదుపరి చర్యలపై ఉత్కంఠ
ఎస్పీ తీసుకున్న కఠిన చర్యలతో కిందిస్థాయి సిబ్బందిలో భయం మొదలైంది. ఇప్పటికే నలుగురిని సస్పెండ్ చేయడంతో, తదుపరి ఎవరిపై వేటు పడుతుందోనని హోంగార్డులు, కానిస్టేబుళ్లలో ఆందోళన నెలకొంది. పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ప్రతి ఒక్కరి లొకేషన్, సీసీ కెమెరాల పుటేజీని ఎస్పీ కార్యాలయం నుంచే పరిశీలిస్తున్నారని తెలియడంతో చాలామంది అప్రమత్తమయ్యారు.
పెట్రోలింగ్ జరిగేనా..?
వరుస ఘటనలపై ప్రజల్లో భయం మొదలైంది. ఇల్లు తాళం వేసి బయటకు వెళితే భద్రత ఉంటుందా అనే భయం ప్రజలను వేధిస్తోంది. పట్టణం, కాలనీలు, శివారు ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ జరగడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పెట్రోలింగ్ నిర్విరామంగా జరిగేలా జిల్లా పోలీసు బాస్ చర్యలు తీసుకుంటారా..? శివారు ప్రాంతాల్లో, సమస్యాత్మక ప్రాంతాల్లో పెట్రోలింగ్ ముమ్మరంగా కొనసాగిస్తారా..? అనేది వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Kamareddy Police Patrolling | నిద్రలో నిఘా వ్యవస్థ..? వరుస చోరీలతో పోలీసు శాఖకు మచ్చ