అక్షరటుడే వెబ్‌డెస్క్: Meerut Blue Drum Murder | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ ‘బ్లూ డ్రమ్ మర్డర్’ కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను అత్యంత క్రూరంగా హత్య చేసిన ఆయన భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలకు బుధవారం మరణశిక్ష (ఉరిశిక్ష) ఖరారు చేసింది. హత్యతో పాటు సాక్ష్యాలను నాశనం చేసేందుకు యత్నించిన ఈ ఇద్దరినీ కోర్టు గతంలోనే దోషులుగా నిర్ధారించగా, తాజాగా శిక్షను ప్రకటించింది.
Meerut Blue Drum Murder | అసలేం జరిగింది?
లండన్‌లో ( Londan )మర్చంట్ నేవీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సౌరభ్ రాజ్‌పుత్ ఫిబ్రవరి 24న మీరట్‌కు తిరిగి వచ్చారు. మార్చి 3న రాత్రి ముస్కాన్ తన భర్త ఆహారంలో నిద్రమాత్రలు కలిపి స్పృహ కోల్పోయేలా చేసింది. ఆ తర్వాత తన ప్రియుడు సాహిల్ సహాయంతో సౌరభ్‌ను హతమార్చి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఒక నీలి రంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో కుక్కి సిమెంట్‌తో సీల్ చేశారు.
తర్వాత కుమార్తెను అమ్మమ్మ గారింట వదిలి ఇద్దరూ హిమాచల్ ప్రదేశ్‌కు పారిపోయారు. సౌరభ్ ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు మెసేజ్‌లు పంపుతూ ఆయన బతికే ఉన్నట్లు నమ్మించే ప్రయత్నం చేశారు. చివరికి మార్చి 18న పోలీసులు డ్రమ్ములో సౌరభ్ మృతదేహాన్ని గుర్తించడంతో ఈ కిరాతకం వెలుగులోకి వచ్చింది.
Meerut Blue Drum Murder | సుదీర్ఘ విచారణ..
ఈ కేసులో పోలీసులు దాదాపు 1,000 పేజీలతో కూడిన ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు. సుమారు 126 విచారణల పాటు సాగిన ఈ ట్రయల్‌లో 22 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. డ్రమ్ము విక్రయించిన దుకాణదారులు, వైద్యులు, కుటుంబ సభ్యుల సాక్ష్యాలతో పాటు నిందితుల కాల్ డేటా, మొబైల్ లొకేషన్లు కీలక ఆధారాలుగా నిలిచాయి. అన్ని అంశాలను పరిశీలించిన న్యాయస్థానం.. ఇది అత్యంత అరుదైన నేరంగా పరిగణించి నిందితులు ఇద్దరికీ మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.
ఇది కూడా చదవండి: Kamareddy Police Patrolling | నిద్రలో నిఘా వ్యవస్థ..? వరుస చోరీలతో పోలీసు శాఖకు మచ్చ