అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Bathukamma Celebrations | నగరంలోని ( Nizamabad) కలెక్టరేట్ ప్రాంగణం బతుకమ్మ పాటలతో మారుమోగిపోయింది. టీఎన్జీవోస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు తీరొక్కపువ్వులతో బతుకమ్మలను పేర్చి.. వాటిచుట్టూ ఆడిపాడారు.
Bathukamma Celebrations | ముఖ్య అతిథిగా కలెక్టర్ ఇలా త్రిపాఠి..
కలెక్టర్ ఇలా త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరై సంబురాల్లో పాలుపంచుకున్నారు. మొదట గౌరిపూజచేసి సంబరాలను ప్రారంభించారు. ఆయా శాఖల మహిళా ఉద్యోగినులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరై ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో అందంగా అలంకరించిన బతుకమ్మలు కనువిందు చేస్తూ, పూల పండుగ ప్రాధాన్యతను చాటాయి. బతుకమ్మ గేయాలను ఆలపిస్తూ మహిళా ఉద్యోగులు, యువతులు, మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆటలాడుతూ ఎంతో ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. దాండియా, కోలాటాలతో బతుకమ్మ సంబురానికి వన్నె చేకూర్చారు.
Bathukamma Celebrations | సందడిగా కలెక్టరేట్..
ఈ సందర్భంగా కలెక్టరేట్లో సందడి వాతావరణం నెలకొంది. కార్యాలయ పనివేళలు ముగిసినప్పటికీ ఉద్యోగినులు ఎవరూ ఇళ్లకు వెళ్లకుండా ఎంతో హుషారుగా ఈ ఉత్సవంలో పాల్గొని బతుకమ్మ వేడుక ఔన్నత్యాన్ని చాటారు. ఉత్తమ అలంకరణతో కూడిన బతుకమ్మలను ఎంపిక చేసి, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్కుమార్, కార్యదర్శి శేఖర్, రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: జాతీయ జెండా పట్టినందుకు అరెస్టా? అమిత్ షాకు CJP సవాల్..!