అక్షరటుడే వెబ్‌డెస్క్: FASTag Annual Pass | జాతీయ రహదారులపై నిత్యం ప్రయాణించే వాహనదారులకు, ముఖ్యంగా టోల్ ప్లాజాల సమీపంలో నివసించే స్థానిక ప్రజలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తీపి కబురు అందించింది. ‘ఫాస్టాగ్ ( FASTag )యానువల్ పాస్’ (FASTag Annual Pass) విధానంలో పలు కీలక మార్పులు చేస్తూ నూతన మార్గదర్శకాలతో అధికారిక గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.
FASTag Annual Pass | తక్కువ ధరకే వార్షిక పాస్..
టోల్ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తూ, సక్రియ ఫాస్టాగ్ కలిగిన స్థానిక వాహనదారులకు రాయితీ వార్షిక పాస్‌లను పొందేందుకు ప్రభుత్వం అర్హత కల్పించింది. ఈ నూతన నిబంధనల ప్రకారం, సదరు టోల్ ప్లాజా గనుక మున్సిపాలిటీ లేదా పట్టణ పరిధికి వెలుపల ఉంటే ఏడాదికి రూ. 1,500 రుసుముతో, అలాగే మున్సిపాలిటీ లేదా స్థానిక పట్టణ పరిధి లోపల ఉంటే ఏడాదికి రూ. 3,000 రుసుముతో ఈ స్థానిక వార్షిక పాస్‌ను పొందవచ్చు.
FASTag Annual Pass | నిబంధనలు , సవరణలు..
ఈ రాయితీ రేట్లను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం సమీక్షించి సవరించే అవకాశం ఉంటుంది. అయితే, ‘క్లోజ్డ్ యూజర్ ఫీ కలెక్షన్ సిస్టమ్’ ఉన్న జాతీయ రహదారులు , ప్రత్యామ్నాయ సర్వీసు రోడ్లు అందుబాటులో ఉన్న మార్గాలకు ఈ లోకల్ రాయితీ పాస్‌లు వర్తించవని కేంద్రం స్పష్టం చేసింది. ఈ కొత్త నిర్ణయం ద్వారా నిత్యం టోల్ ప్లాజాల గుండా ప్రయాణించే స్థానికులకు రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గనున్నాయి.
ఇది కూడా చదవండి: Arnab Cyclone | తుపాన్ ఎఫెక్ట్.. సముద్రం అల్లకల్లోలం