అక్షరటుడే, వెబ్‌డెస్క్ : E-Cigarette Seized | మైనర్లకు నిషేధిత ఇ–సిగరెట్లు విక్రయిస్తున్న ఓ దుకాణంపై ఈగల్ ఫోర్స్, కుషాయిగూడ పోలీసులు దాడి చేశారు. 39 ఇ-సిగరెట్లను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలోని సైనిక్‌పురిలో గల ‘ది స్మోక్ షాప్’పై మంగళవారం అధికారులు దాడి చేశారు. కేరళకు చెందిన ఉబైస్ స్థానికంగా నివాసం ఉంటూ ఈ షాపు నిర్వహిస్తున్నాడు. గతంలో తనకు బెంగళూరులో పరిచయం అయిన అర్షద్ అనే వ్యక్తి నుంచి ఇ–సిగరెట్లను కొనుగోలు చేశాడు. జూలైలో రూ.50 వేల విలువైన ఉత్పత్తులను కొనుగోలు చేశాడని, సెప్టెంబర్‌లో బెంగళూరు పర్యటన సందర్భంగా మరోసారి సరుకును తెప్పించుకున్నాడు. అనంతరం వాటిని స్థానికంగా యువతతో పాటు మైనర్లకు విక్రయిస్తున్నాడు.
E-Cigarette Seized | వాట్సాప్‌లో ఆర్డర్లు
నిందితుడు వాట్సాప్ ద్వారా ఇ–సిగరెట్లను విక్రయించేవాడు. అంతేగాకుండా ర్యాపిడో ద్వారా ఇంటికే నిషేధిత ఇ–సిగరెట్లను డెలివరీ చేసేవాడు. ఆగస్టు 3 నుంచి ఇప్పటి వరకు 26 డెలివరీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లో సుమారు 45 మంది వినియోగదారులు వీటిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా కర్ణాటకలోని కాసరగోడ్, దక్షిణ కన్నడ జిల్లాల్లోని సంస్థలకు సంబంధించిన రూ.10 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.
E-Cigarette Seized | ఆరోగ్యానికి హానికరం
ఇ– సిగరెట్లు (వేపింగ్) ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయి. దీనికి అలవాటు పడితే.. బానిసలుగా మారుతారు. ముఖ్యంగా మైనర్ల మెదడుపై ప్రభావం చూపుతుందని అధికారులు హెచ్చరించారు. నిషేధిత వేపింగ్ ఉత్పత్తులు విద్యార్థులకు చేరకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ఈగల్ ఫోర్స్ సూచించింది.
దీనిని కూడా చదవండి : Municipal Corruption | ప్రతి పనికి డబ్బులు అడుగుతున్నారు.. బల్దియా ఎదుట ప్రజల ఆందోళన