అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lal Darwaza Bonalu | హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఆదివారం లాల్‌దర్వాజ బోనాలు ఘనంగా జరిగాయి. వేలాది మంది భక్తులు సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా పోలీసులు పకడ్బంది చర్యలు చేపట్టారు.
బోనాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆధునిక సాంకేతికను వినియోగించారు. భారీగా పోలీసులను మోహరించారు. ఆదివారం బోనాలు, సోమవారం జాతర సమయాల్లో పోలీసులు 116 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ (Additional CP) వివరాలు వెల్లడించారు. భక్తులు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆస్తి సంబంధిత నేరాల నియంత్రణ కోసం స్పెషల్ క్రైమ్ బృందాలను మోహరించామన్నారు.
Lal Darwaza Bonalu | నేరాల నియంత్రణ కోసం
ఉత్సవాల్లో నేరాల నివారణ చర్యల్లో భాగంగా స్పెషల్ క్రైమ్ టీమ్ (Crime Team) ఉత్సవ ప్రాంతం, పరిసరాల్లో ముమ్మర నిఘా, విస్తృత తనిఖీలు చేపట్టిందన్నారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారనించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా పాత నేరస్థులు, గతంలో నేర చరిత్ర ఉన్నవారి కదలికలపై నిరంతర పర్యవేక్షణ పెట్టామన్నారు. అనుమానాస్పద కదలికలను గుర్తించడానికి మఫ్టీ పోలీసులను రంగంలోకి దించామన్నారు. ఈ చర్యల్లో భాగంగా స్పెషల్ క్రైమ్ బృందం మొత్తం 116 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని సమగ్ర విచారణ జరిపినట్లు అడిషనల్ సీపీ తెలిపారు.
Lal Darwaza Bonalu | ఎఫ్ఆర్ఎస్ ద్వారా..
ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాలు, పోలీస్ శాఖ నేరస్థుల డేటాబేస్ ద్వారా వారి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించగా, వీరిలో 8 మంది పాత నేర చరిత్ర కలిగిన వ్యక్తులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఆయన తెలిపారు. స్పెషల్ క్రైమ్ టీమ్, స్థానిక పోలీసుల సమన్వయంతో ఉత్సవాల్లో శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమైందని పేర్కొన్నారు.
దీనిని కూడా చదవండి : Pocharam Srinivas Reddy | కాంగ్రెస్‌లో చేరినా.. నిధులు ఇవ్వడం లేదు : ఎమ్మెల్యే పోచారం