అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల (బోయినపల్లి): Boyinapalli Alternative Crops | సంప్రదాయంగా వరిని సాగు చేస్తున్న ఆ రైతు దానిని వదిలి కూరగాయల సాగు వైపు మళ్లాడు. నాలుగు ఎకరాల్లో నాలుగు రకాల పంటలు సాగు చేస్తున్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా ముందుకెళ్తూ ఆదాయం పొందుతున్నారు. బోయినపల్లి మండలం రామన్నపేటకు చెందిన ఆదర్శ రైతు మిట్టపల్లి కమలాకర్ రెడ్డిని కలెక్టర్ గరిమా అగ్రవాల్ అభినందించారు.
Boyinapalli Alternative Crops | బోయినపల్లి మండలం..
బోయినపల్లి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన రైతు సంప్రదాయంగా సాగుచేస్తున్న వరిని వదిలిపెట్టారు. దాని స్థానంలో నాలుగు ఎకరాల్లో బూడిద గుమ్మడి, కూర (రాస) గుమ్మడి, మిర్చి, బీరకాయ సాగు చేస్తున్నారు మల్చింగ్ విధానంలో మిర్చి, బీరకాయ కోసం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఆయా పంటలకు నీటిని అందిస్తూ జల వనరులను సద్వినియోగం చేస్తున్నారు. గుమ్మడి ఎకరంలో సాగు చేయగా, అన్ని ఖర్చులు పోను రూ.80 వేల ఆదాయం, ఒక ఎకరం విస్తీర్ణంలో మిర్చి వేయగా, రూ.2లక్షలు ఆదాయం, ఒక ఎకరం విస్తీర్ణంలో బీరకాయ సాగు చేయగా, రూ. లక్ష ఆదాయం, 20 గుంటల్లో కూర (రాస ) గుమ్మడి సాగు చేయగా, రూ.30 వేల ఆదాయం వచ్చిందని రైతు మిట్టపల్లి కమలాకర్ రెడ్డి చెప్పారు.
Boyinapalli Alternative Crops | క్షేత్రస్థాయిలో పరిశీలించి..
రైతు మిట్టపల్లి కమలాకర్ రెడ్డి వ్యవసాయ క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్(Collector Garima Agrawal) మంగళవారం పరిశీలించారు. బూడిద గుమ్మడి సాగును పరిశీలించి.. సాగు విధానం, దిగుబడి.. మార్కెట్ సౌకర్యం పై అడిగి తెలుసుకున్నారు. తాను వేములవాడ, కరీంనగర్ మార్కెట్లో విక్రయిస్తానని, మంచి దిగుబడి ఆదాయం ఉందని రైతు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. అలాగే మల్చింగ్ విధానం, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో బీరకాయ, మిర్చి పంట సాగు చేస్తున్న విధానాన్ని పరిశీలించి అభినందించారు. మిగతా రైతులు కూడా వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసి ఆదాయాన్ని పొందాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. పరిశీలనలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: జైలులో సినిమా లెవెల్ యాక్టింగ్.. 17 మంది ఖైదీలు పరారీ!