అక్షరటుడే వెబ్‌డెస్క్: KTR RR Tax | తెలంగాణలో వసూలు చేస్తున్నారని ప్రచారం జరుగుతున్న ‘ఆర్ఆర్ ట్యాక్స్’ (RR Tax) అంశంపై బిఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘బడా భాయ్’ నరేంద్ర మోదీ, తన పాత ‘ఏబీవీపీ చోటా భాయ్’ రేవంత్ రెడ్డిపై ఎప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోరని ఆయన ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (X) వేదికగా తీవ్ర స్థాయి ఆరోపణలు చేస్తూ సుదీర్ఘ పోస్ట్ చేశారు.
KTR RR Tax | చదరపు అడుగుకు రూ. 200 వసూలు..
హైదరాబాద్ నగరంలో ఏ బిల్డర్‌ను లేదా రియల్ ఎస్టేట్ డెవలపర్‌ను అడిగినా ఆర్ఆర్ ట్యాక్స్ దందా వాస్తవమేనని చెప్తారని కేటీఆర్ పేర్కొన్నారు. నిర్మాణ రంగానికి సంబంధించి ప్రతి చదరపు అడుగుకు రూ. 200 చొప్పున బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విషయం రియల్ ఎస్టేట్ వర్గాల్లో బహిరంగ రహస్యమేనని, ఇది నిజం కాదా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కలిసి కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపణలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, దీనిపై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు.
KTR RR Tax | చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తరచూ హైదరాబాద్ నగర పర్యటనలకు వస్తుంటారని కేటీఆర్ గుర్తుచేశారు. నగరానికి వచ్చిన ప్రతిసారీ సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలపై ‘ఆర్ఆర్ ట్యాక్స్’ పేరిట వేల కోట్లు దోచుకుంటున్నారంటూ ఆరోపణలు చేసి వెళ్లిపోవడం తప్ప, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆ వసూళ్లపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. కేవలం మాట్లాడటం తప్ప చేతల్లో శూన్యమని విమర్శించారు.
KTR RR Tax | అంతర్గత అవగాహన..
హైదరాబాద్‌లోని సామాన్య డెవలపర్లకు తెలిసిన ఈ వసూళ్ల వ్యవహారం కేంద్ర నిఘా వర్గాలకు, బీజేపీ అగ్రనాయకత్వానికి తెలియదా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆరోపణలు చేయడమే తప్ప చర్యలు తీసుకోకపోవడం వెనుక కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందమే కారణమని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోవడమే ఈ అంతర్గత అవగాహనకు ప్రత్యక్ష నిదర్శనమని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Punjab DA Case | అప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు జవాబుదారీగా ఉంటారు : సుప్రీంకోర్టు