అక్షరటుడే వెబ్డెస్క్: Delhi Diwali Tragedy | దేశమంతా దీపావళి వెలుగుల సంబరాల్లో మునిగి తేలుతున్న వేళ ఒక ఇంట్లో ఊహించని తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పండుగ సరదా కోసం తల్లిదండ్రులు కొనిచ్చిన తారాజువ్వు ( Rocket ) ఒక పదేళ్ల బాలుడి ప్రాణాలను తీసింది. ఢిల్లీలోని నరేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ కాలనీలో ఆదివారం (నవంబర్ 8) రాత్రి ఈ ఘోర దుర్ఘటన జరిగింది. సరదాగా జరుపుకోవాల్సిన పండుగ వేళ బాలుడు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్రమైన దుఃఖం, శోకసంద్రం అలుముకున్నాయి.
Delhi Diwali Tragedy | పైకి ఎగరాల్సిన రాకెట్..
పోలీసులు , కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి ఇంట్లో దీపావళి పూజ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కుటుంబమంతా బయట బాణసంచా కాలుస్తోంది. ఈ క్రమంలో పదేళ్ల బాలుడు కూడా ఉత్సాహంగా తారాజువ్వు (రాకెట్) వెలిగించాడు. అయితే, ఆ రాకెట్ ఆకాశంలోకి ఎగరడానికి బదులుగా దిశ మారి సర్రున వచ్చి సదరు బాలుడి కడుపు భాగంలోకి బలంగా ఢీకొని అక్కడే పేలిపోయింది. తీవ్ర గాయపడి రక్తం మడుగులో పడిపోయిన బాలుడిని చూసి కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Delhi Diwali Tragedy | ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన ..
గాయపడిన బాలుడిని వెంటనే నరేలాలోని రాజా హరిశ్చంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆసుపత్రి సిబ్బంది, వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లాడు చనిపోయాడని ఆరోపిస్తూ బంధువులు ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి , ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణమైన పటాసు ఏ రకానికి చెందినది? నిబంధనల ప్రకారమే తయారైందా? అనే పలు అంశాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి: Khilla Raghunath Temple Fire | ఖిల్లా రఘునాథ ఆలయ ముఖద్వారం వద్ద అగ్నిప్రమాదం..