Harish Rao Surveyors Protest | యువత తిరగబడితే రేవంత్ సర్కార్ మూల్యం చెల్లించుకోక తప్పదు: హరీశ్ రావు

హక్కుల కోసం ఆందోళన చేపట్టిన లైసెన్స్ సర్వేయర్లపై పోలీసుల అణచివేతను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Surveyors Protest | హక్కుల కోసం ఆందోళన చేపట్టిన లైసెన్స్ సర్వేయర్లపై పోలీసుల అణచివేతను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. తెలంగాణ భవన్‌లో లైసెన్స్ సర్వేయర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీటెక్, ఎంటెక్, సివిల్ ఇంజనీరింగ్ చదివిన యువతను పశువుల్లా ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం దారుణమన్నారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన సర్వేయర్లపై ఐఏఎస్ అధికారి లోకేశ్ కుమార్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడిన తీరు అత్యంత బాధ్యతారహితంగా, ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.

Harish Rao Surveyors Protest | మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది..

ఢిల్లీలో విద్యార్థులు, యువకులు తిరగబడితే కేంద్రమంత్రే రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని హరీశ్ రావు గుర్తుచేశారు. 6,000 వేల మంది లైసెన్స్ సర్వేయర్లు, వారి వెనకున్న కుటుంబాలు శక్తిగా మారి తిరగబడితే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy ), మంత్రి పొంగులేటి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అరెస్టు చేసిన తర్వాత కనీసం అన్నం పెట్టకుండా హింసించడం, “మీరు హరీశ్ రావు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు?” అంటూ సర్వేయర్లను ప్రభుత్వం బెదిరించడం సిగ్గుచేటన్నారు.

Harish Rao Surveyors Protest | సీఎం ఈగో హర్ట్ అయిందంటూ..

ప్రభుత్వం సమస్యలను పట్టించుకోనప్పుడే ప్రజలు ప్రతిపక్షం దగ్గరికి వస్తారని, ప్రజా సమస్యలపై ప్రభుత్వ మెడలు వంచడానికే తామున్నామని స్పష్టం చేశారు. సీఎంవో అధికారుల తీరు చూస్తే ఆశ్చర్యమేస్తోందని.. లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడితే సీఎం ఈగో హర్ట్ అయిందంటూ అధికారులను వెళ్లగొట్టడం అహంకారం కాదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఆకాశం నుంచి ఊడిపడలేదని, ముఖ్యమంత్రి పదవి ప్రజలు పెట్టిన భిక్ష అని, అధికారులకు జీతాలు ఇచ్చేది ప్రజలు కట్టే పన్నుల నుంచే అన్న విషయం మర్చిపోవద్దన్నారు.

Harish Rao Surveyors Protes | దివాళాకోరుతనానికి నిదర్శనం..

కుటుంబాలు గడవక ఇద్దరు లైసెన్స్ సర్వేయర్లు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. కనీస జీతం, టీఏ/డీఏలు, హెల్త్ ఇన్సూరెన్స్ లేక సొంత డబ్బులతో సర్వే చేయాల్సిన దుస్థితి ఉందన్నారు. ఎకరానికి కేవలం రూ. 60 చొప్పున ఇస్తే బతికేదెట్లా అని నిలదీశారు. ఇదే విషయాన్ని కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్తే.. “మీరు లంచాలు తీసుకోండి, వసూలు చేసుకోండి” అని చెప్పడం ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనం అన్నారు. 70 వేల ఉద్యోగాలు ఇచ్చామని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని, కేసీఆర్ ప్రభుత్వం ప్రక్రియ పూర్తి చేసిన ఉద్యోగాలకు వీరు నియామక పత్రాలు ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్నే నిలదీస్తే.. తాము ఇచ్చింది కేవలం 16,500 ఉద్యోగాలేనని స్వయంగా ఒప్పుకున్నారని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ఇచ్చిన హామీలను విస్మరించి, ఇప్పుడు ఈ 6 వేల మంది లైసెన్స్‌లను కూడా ఉద్యోగాల ఖాతాలో వేసుకుని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సర్వేయర్లు ఎవరూ అధైర్యపడి ప్రాణాలు తీసుకోవద్దని, బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి అండగా ఉంటామని భరోసానిచ్చారు.

ఇది కూడా చదవండి:  Mandal Congress Committees | నెలాఖరులోగా మండల కాంగ్రెస్​ కమిటీల నియామకం: పీసీసీ చీఫ్​

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *