Fake Certificates Scam | నకిలీల గుట్టు రట్టయ్యేనా..? కామారెడ్డిలో భారీగా నకిలీ సర్టిఫికెట్ల విక్రయం..?

చదువు లేకుండానే డిగ్రీ.. పరీక్షలు రాయకుండానే బీటెక్.. ఒరిజినల్‌లా కనిపించే సర్టిఫికెట్.. లక్షల్లో వేతనంతో విదేశీ ఉద్యోగం.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Fake Certificates Scam | చదువు లేకుండానే డిగ్రీ.. పరీక్షలు రాయకుండానే బీటెక్.. ఒరిజినల్‌లా కనిపించే సర్టిఫికెట్.. లక్షల్లో వేతనంతో విదేశీ ఉద్యోగం. వినడానికి సినిమా కథలా ఉన్నా.. కామారెడ్డి జిల్లా (Kamareddy District)లో ఇదే ఇప్పుడు నిజంగా జరుగుతోందన్న ప్రచారం కలకలం రేపుతోంది.

Fake Certificates Scam | యువత అవసరం.. అమాయకత్వాన్ని..

యువత అవసరాన్ని, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని కొందరు కేటుగాళ్లు నకిలీ సర్టిఫికెట్ల దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ప్రముఖ యూనివర్సిటీ పేరుతో ఒరిజినల్ సర్టిఫికెట్ల మాదిరిగానే తయారు చేసి విక్రయిస్తున్నారు. ఉద్యోగం సంపాదించాలనే ఆరాటంలో యువత నకిలీదా.. ఒరిజినలా.. అని చూసుకోకుండానే లక్షలు చెల్లిస్తున్నారు. తీరా అది నకిలీ అని తెలిసేసరికి లబోదిబోమంటున్నారు.

Fake Certificates Scam | జిల్లాకు చేరిన నకిలీ సర్టిఫికెట్లు..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు ప్రస్తుత తెలంగాణలో పేరుమోసిన ఓ యూనివర్సిటీ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు తయారవుతున్నాయి. పరిచయస్తుల ద్వారా ఈ ముఠా కామారెడ్డి జిల్లాలోకి కూడా ప్రవేశించిందన్న ప్రచారం సాగుతోంది. ఇక్కడి పరిచయాలతో పదుల సంఖ్యలో సర్టిఫికెట్లు విక్రయించినట్లు తెలుస్తోంది.

Fake Certificates Scam | అవసరాన్ని గుర్తించి.. క్యాష్‌గా మలుచుకుని..

డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పట్టాలు పొందిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రావడం సాధ్యం కాదు. ఈ విషయాన్ని గ్రహించిన కేటుగాళ్లు.. విదేశాల్లో లక్షల్లో వేతనం వస్తుందని నమ్మిస్తూ డిగ్రీ పట్టా పొందలేని వారికి నకిలీ సర్టిఫికెట్లు అంటగడుతున్నారు. యువత అవసరం, ఆశయాలను గుర్తించి దానిని క్యాష్‌గా మలుచుకుంటున్నారు. ఫలితంగా యువత భారీగా మోసపోతున్నారు.

Fake Certificates Scam | విదేశాల్లో ఇద్దరు ఉద్యోగులు

ఇటీవల ఈ ముఠా నుంచి సర్టిఫికెట్లు కొనుగోలు చేసి జిల్లాకు చెందిన ఇద్దరు విదేశాల్లో ఉద్యోగం పొందినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక వ్యక్తి తనకు బాగా దగ్గరి బంధువు ద్వారా నకిలీ సర్టిఫికెట్ విక్రయించే వ్యక్తి నుంచి రూ.3 లక్షలకు సర్టిఫికెట్ కొనుగోలు చేసి అమెరికాకు వెళ్లినట్లు సమాచారం. అదే విధంగా మరొక వ్యక్తి కూడా ఇలాగే సర్టిఫికెట్ కొని ఐర్లాండ్ వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి సర్టిఫికెట్ల అంశం బయటకు పొక్కడంతో పోలీసులకు ఫిర్యాదు వెళ్లగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Fake Certificates Scam | యూనివర్సిటీకి చెందిన వారేనా..?

ఈ వ్యవహారంలో అత్యంత అనుమానాస్పద అంశం ఏమిటంటే.. సర్టిఫికెట్ నకిలీ అయినప్పటికీ సంబంధిత యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఓపెన్ చేస్తే ఒరిజినల్‌గానే కనిపించడం. దీంతో సర్టిఫికెట్లు తయారు చేస్తున్న వ్యక్తులు యూనివర్సిటీకి చెందిన వారేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం యూనివర్సిటీ యాజమాన్యానికి తెలిసి ఉండకపోవచ్చని, అందులో పనిచేసే సిబ్బందే ఇది చేసి ఉంటారన్న అనుమానాలు కూడా ఉన్నాయి.

Fake Certificates Scam | పోలీసుల అదుపులో నిందితులు..?

నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా నుంచి వచ్చిన ఆ వ్యక్తి రెండు నెలల్లోనే తిరిగి వెళ్లాల్సి ఉండగా, ఈ మధ్యలోనే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. సదరు వ్యక్తి చెప్పిన వ్యక్తిని సైతం పోలీసులు అరెస్ట్ చేయగా, అతని ద్వారా యూనివర్సిటీలో పనిచేస్తున్న మరొక వ్యక్తి పేరు బయటపడినట్లు విశ్వసనీయ సమాచారం. సర్టిఫికెట్ తీసుకున్న మరొక వ్యక్తి పండగ నేపథ్యంలో ఇంటికి రాగా, పోలీసులకు తెలిసిందని తెలుసుకుని పండగ కాగానే తిరిగి టికెట్ బుక్ చేసుకుని విదేశాలకు వెళ్లిపోయినట్లు ప్రచారం సాగుతోంది. పండగల నేపథ్యంలో పోలీసులు బందోబస్తులో బిజీగా ఉండటం అతనికి కలిసి వచ్చిందని తెలుస్తోంది.

Fake Certificates Scam | సూత్రధారి చిక్కేనా..?

నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి లక్షల రూపాయలకు విక్రయిస్తున్న వ్యక్తులపై పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో పనిచేస్తున్న సిబ్బంది హస్తం ఉండవచ్చన్న అనుమానాల నేపథ్యంలో అసలు సూత్రధారి ఎవరు? ఆ వ్యక్తికి యూనివర్సిటీ నుంచి మద్దతు ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కామారెడ్డి జిల్లా నుంచి ప్రస్తుతానికి ఇద్దరు వ్యక్తులు మాత్రమే విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నట్లు బయటకు పొక్కింది. అయితే జిల్లాలో ఇంకా అనేక మంది నకిలీ సర్టిఫికెట్లు సమర్పించి వివిధ ఉద్యోగాల్లో చేరినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మిగతా వారి వివరాలు బయటపడతాయా లేదా అనేది కొద్దిరోజులు వేచి చూడాలి.

ఇది కూడా చదవండి..: Government Employees Issues | ​ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *