Revanth Reddy Minority Welfare | మైనార్టీ స్కాలర్‌షిప్‌లపై కూడా బీజేపీ రాజకీయం చేస్తోంది: సీఎం రేవంత్

హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో జాతీయ విద్యా, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Revanth Reddy Minority Welfare | హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో జాతీయ విద్యా, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మైనారిటీలకు అన్ని వేళలా, అన్ని రకాలుగా పూర్తి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దేశంలో విద్యా, సాగునీటి రంగాలకు తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. నాడు నెహ్రూ వేసిన బలమైన పునాదుల వల్లే నేడు దేశం ఈ స్థాయిలో అభివృద్ధి సాధించిందన్నారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను తొలి విద్యాశాఖ మంత్రిగా నియమించి, దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు, ఐఐటీ (IIT)లను కాంగ్రెస్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆనాడు పడిన బలమైన పునాదుల ఫలితంగానే నేడు భారతీయ యువత ప్రపంచ ప్రఖ్యాత సంస్థలకు సీఈవోలుగా ఎగుతుగున్నారని పేర్కొన్నారు.

Revanth Reddy Minority Welfare | నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట..

ప్రస్తుత కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా యువతలో స్కిల్స్ పెరగాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకే ఐటీఐ (ITI)లను ఏఐటీసీ (ITC)లుగా మారుస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా, ఆధునిక వసతులతో రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని (Skill University) నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరిస్తుండటం వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలకు కొంత ముప్పు ఏర్పడుతోందని, అయితే ఏఐ ఎంత పెరిగినా బ్లూ కాలర్ ఉద్యోగాలకు మాత్రం ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే సచార్ కమిటీ సిఫార్సుల మేరకు మైనార్టీలకు విద్య, ఉద్యోగాల్లో 4 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిందని గుర్తుచేశారు. బీజేపీ పాలిత గుజరాత్‌లోనూ మైనార్టీ రిజర్వేషన్లు అమలవుతుండగా.. తెలంగాణలో మాత్రం వాటిని తొలగిస్తామని బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు.

Revanth Reddy Minority Welfare | రేవంత్ తీవ్ర విమర్శలు..

రాష్ట్రంలో మైనార్టీల ఓటు హక్కును తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. సర్ (SIR) పేరిట మైనార్టీలు, ఎస్టీలు, ఆదివాసీలు, నిరుపేదల ఓట్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనార్టీ విద్యార్థులకు అందే స్కాలర్‌షిప్‌లపై కూడా కాషాయ పార్టీ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనంటూ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నిరాధార ఆరోపణలను ఆయన తీవ్రంగా తిరస్కరించారు. నరేంద్ర మోదీని గద్దె దించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఢిల్లీకి వెళ్లి మోదీ ముందు మోకరిల్లి సాగిలపడింది ఎవరో ప్రజలందరికీ బాగా తెలుసంటూ బీఆర్ఎస్ నేతలపై పరోక్షంగా ఎద్దేవా చేశారు.

ఇది కూడా చదవండి: Government Employees Issues | ​ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

 

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *