Paddy Farmers | ధాన్యం క్వింటాల్​కు రూ.3,500 వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలి

ధాన్యం క్వింటాల్​కు రూ.3,500 వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Paddy Farmers | రైతులకు ధాన్యం క్వింటాల్​కు రూ.3,500 వచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి (Dinesh Kulachari) పేర్కొన్నారు. బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 5.35 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారని దినేష్​ పేర్కొన్నారు. ఈసారి దిగుబడి ఆశాజనకంగా ఉండి రికార్డు స్థాయిలో 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారన్నారు. బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో పూర్తిగా ఆర్మూర్ సహా జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో సగం వరకు పంట కోతలు పూర్తయి రైతులు ఇప్పటికే సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు, కమీషన్ ఏజెంట్లు, దళారులకు అమ్ముకున్నారన్నారు. ప్రారంభంలో పచ్చి సన్న వడ్లు క్వింటాల్‌కు రూ. 3,600 ధర పలకగా, ఇప్పుడు అమాంతం రూ. 2,700 కు పడిపోయిందన్నారు. దీంతో రైతులు తీవ్ర నష్టాలపాలవుతున్నారు.

Paddy Farmers | రైతుల వద్ద ఇంకా 7 లక్షల ​ టన్నుల ధాన్యం..

ఇంకా రైతుల వద్ద 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉందన్ని దినేష్​ తెలిపారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కనీసం 8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేది. కానీ ఈసారి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద కాంటాలు కావడం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం సమీక్షలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, బాధ్యతను గాలికి వదిలేసిందని.. రైతులకు సన్న వడ్లపై ఇస్తామన్న బోనస్‌ను ఎగవేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రస్తుతం మార్కెట్‌లో బియ్యానికి విపరీతమైన డిమాండ్ ఉందని.. దీంతో వడ్లకు మార్కెట్​లో క్వింటాల్​కు రూ.3,500 వచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు.

Paddy Farmers | ఎంఎస్​పీ అంటే కూడా తెలియని ఎమ్మెల్యే..

ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పేర్కొన్నారు. రైతులు తమ పంటకు కనీస ధర దక్కడం లేదని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి దగ్గరికి వెళితే MSP (మద్దతు ధర) కన్నా ఎక్కువగానే వస్తోంది కదా’ అంటూ ఆయన బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం శోచనీయమన్నారు. ఎంఎస్​పీ (MSP) అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ (కనీస మద్దతు ధర) అంతేగానీ మాక్సిమం సపోర్ట్ ప్రైస్ (గరిష్ట మద్దతు ధర) కాదని.. ఎమ్మెల్యేకు కనీస జ్ఞానం కూడా లేకపోవడం ఘోరమని దినేష్​ పేర్కొన్నారు. సమావేశంలో నూతుల శ్రీనివాస్ రెడ్డి, బిలోజీ నాయక్, బొబ్బలి వేణు గోపాల్, పద్మరెడ్డి, నరేష్, అమంద్ విజయ్ కృష్ణ, ఎర్రం సుదీర్, బద్దం కిషన్, ఓం సింగ్, గంగారెడ్డి, వంశీ గౌడ్, శంకర్ రెడ్డి, రాజేశ్వర్, అనంద్, జగన్ రెడ్డి, అన్నం గోపి, బట్టురాఘవేందర్, మల్కాయ్ మహేందర్, మఠం పవన్ సుందర్ సింగ్ రాథోడ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Turmeric Farmers | రైతులు పసుపు పంటను తొందరపడి అమ్మొద్దు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *